Nasa Artemis 1 : నాసా 'ఆర్టెమిస్ 1' ప్రయోగం వాయిదా..

Nasa Artemis 1 : అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా చేపట్టిన ఆర్టెమిస్ -1 ప్రయోగం వాయిదా పడింది.;

Update: 2022-08-29 15:45 GMT

Nasa Artemis 1 : అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా చేపట్టిన ఆర్టెమిస్ -1 ప్రయోగం వాయిదా పడింది. ఇంధన లీకేజీ వల్ల ప్రయోగాన్ని నిలిపేస్తున్నట్లు నాసా వెల్లడించింది. తిరిగి రాకెట్‌ను ప్రయోగిస్తారో స్పష్టం చేయలేదు. రాకెట్లో 10లక్షల గ్యాలన్ల హైడ్రోజన్, ఆక్సిజన్ నింపాల్సి ఉంది. ఇంధన లీకేజ్‌తో ఈ ప్రక్రియకు అవాంతరాలు ఎదురయ్యాయి. ఇంజిన్‌3లో సమస్య తలెత్తడంతో లాంచ్‌ పాడ్‌పై రాకెట్‌ ఉన్నచోట పిడుగులు పడ్డాయి. దీంతో ప్రయోగాన్ని ఆపేశారు.

ఆర్టెమిస్ -1 ప్రయోగం ద్వారా మరో చరిత్రాత్మక ఘట్టానికి నాసా శ్రీకారం చుట్టింది. 50 ఏళ్ల తర్వాత చంద్రడిపైకి మనిషిని పంపే ప్రయోగమిది. ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ రాకెట్లు, వ్యోమ నౌకలు పంపనుంది. చందమామను చుట్టి వచ్చే ఈ స్పేస్ షిప్‌లో వ్యోమగాములు ఉండరు. తర్వాత జరిగే ప్రయోగాల్లో మాత్రం మనుషులను పంపనుంది నాసా. ఈ ప్రయోగం సక్సెస్ అయితే అంతరిక్షంలో సుదూర ప్రాంతాల దిశగా మానవులకు బాటలు పడనున్నాయి.

42 రోజుల ఈయాత్రలో ఆర్టెమిస్‌-1.. 13 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఆర్టెమిస్-1 యాత్ర ఆరు వారాల పాటు కొనసాగనుంది. ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి SLS నింగిలోకి దూసుకెళుతుంది. నిర్దేశిత సమయం తర్వాత రాకెట్‌తో ఒరాయన్‌ విడిపోతుంది. కాలిఫోర్నియా తీరానికి చేరువలో పసిఫిక్‌ మహాసముద్రంలో ఈ వ్యోమనౌక పడుతుంది. అంతాసవ్యంగా జరిగితే ఈఏడాది అక్టోబరు పదో తేదీతో ఈ యాత్ర ముగిసేది. కానీ ఆర్టెమిస్-1 ప్రయోగం వాయిదాతో యాత్ర ఎప్పుడు ముగుస్తుందనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఇక ఈప్రాజెక్టు కోసం నాసా ఏకంగా 9వేల300 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది.

ఆర్టెమిస్‌-1లో పది బుల్లి క్యూబ్‌శాట్‌లనూ నాసా ప్రయోగించనుంది. ఒరాయన్‌ నుంచి విడిపోయాక అవి చంద్రుడి దిశగా పయనమవుతాయి. ఇందులో బయోసెంటినిల్‌ అనే ఉపగ్రహం.. జాబిలిపై ఉండే రేడియోధార్మికత, సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి, సూక్ష్మజీవుల వృద్ధిని పరిశీలిస్తుంది. నియా స్కౌట్‌ అనే ఉపగ్రహాన్ని కూడా పంపించనుంది నాసా. ఇది సౌర తెరచాప సాయంతో సమీపంలోని గ్రహశకలం వద్దకు పయనమవుతుంది.

గ్రీక్‌ పురాణాల ప్రకారం ఆర్టెమిస్‌ ఒక దేవత. జ్యూస్‌ కుమార్తె. అపోలోకు కవల సోదరి. ఆర్టెమిస్‌ యాత్రల్లో భాగంగా మహిళా వ్యోమగామికీ అవకాశం కల్పిస్తున్నందువల్ల ఈదేవత పేరును నాసా ఎంచుకుంది. ఆర్టెమిస్‌-1 తర్వాత జరిగే ప్రయోగాలేంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2024లో ఆర్టెమిస్‌-2 యాత్రను నిర్వహించనుంది నాసా. అందులో నలుగురు వ్యోమగాములు ఉంటారు. అయితే వారు చంద్రుడిపై దిగరు. జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి వస్తారు. ఆయాత్ర విజయవంతమైతే విశ్వంలో మనిషి ప్రయాణించిన అత్యంత ఎక్కువ దూరం అదే అవుతుంది.

2025లో ఆర్టెమిస్‌-3 జరుగుతుంది. ఆయాత్రలో ఒక మహిళ సహా నలుగురు వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతారు. ఇందుకోసం ఒరాయన్‌.. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్‌ వ్యోమనౌకపై ఆధారపడనుంది. తర్వాతి దశలో 'గేట్‌వే' పేరుతో చంద్రుడి కక్ష్యలో ఒక మజిలీ కేంద్రాన్ని నాసా ఏర్పాటు చేస్తుంది. జాబిలి ఉపరితలానికి చేరుకోవడానికి ముందు వ్యోమగాములు ఇందులో బస చేస్తారు. సుదూర అంతరిక్ష యాత్రలకూ దీన్ని విడిది కేంద్రంగా ఉపయోగించుకుంటారు.

Tags:    

Similar News