Trump Solar Tariff : సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా తగ్గని ట్రంప్...సోలార్ ప్యానెళ్లపై 126 శాతం పన్ను బాదుడు.
Trump Solar Tariff : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ బాదుడును ఆపడం లేదు. సుంకాల విధింపుపై అక్కడి సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, ఆయన ఏమాత్రం తగ్గకుండా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా భారత దేశానికి గట్టి షాక్ ఇస్తూ.. భారత్ నుంచి దిగుమతి అయ్యే సోలార్ ఉత్పత్తులపై ఏకంగా 126 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ తన సోలార్ పరిశ్రమకు అక్రమంగా సబ్సిడీలు ఇస్తూ అమెరికా మార్కెట్‌ను దెబ్బతీస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.
కేవలం భారత్‌పైనే కాకుండా, ఇండోనేషియా, లావోస్ దేశాలపై కూడా ట్రంప్ తన ప్రతాపాన్ని చూపించారు. ఇండోనేషియా సోలార్ ప్యానెళ్లపై గతంలో ఉన్న 86 శాతం పన్నును ఇప్పుడు ఏకంగా 143 శాతానికి పెంచారు. అలాగే లావోస్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 81 శాతం టారిఫ్ విధించారు. భారత ప్రభుత్వం తన దేశీయ తయారీదారులకు తక్కువ వడ్డీకే రుణాలు, విద్యుత్ రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వడం వల్ల, ఆ ప్యానెళ్లు అమెరికాలో చాలా తక్కువ ధరకే అమ్ముడవుతున్నాయని ట్రంప్ వాదన. దీనివల్ల అమెరికాలోని స్థానిక కంపెనీలు భారీగా నష్టపోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిర్ణయం వెనుక చైనా మార్క్ కుట్ర కూడా ఉందని అమెరికా అనుమానిస్తోంది. గతంలో చైనా సోలార్ ఉత్పత్తులపై అమెరికా నిషేధం విధించడంతో, చైనా కంపెనీలు తమ వ్యాపారాన్ని వియత్నాం, మలేషియా వంటి దేశాలకు మార్చాయి. అక్కడ కూడా పన్నులు పెరగడంతో, ఇప్పుడు భారత్, ఇండోనేషియా, లావోస్‌లను అడ్డాగా చేసుకుని చైనా సరుకును అమెరికాకు పంపిస్తున్నాయని అమెరికా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 2025 మొదటి ఆరు నెలల్లో అమెరికా దిగుమతి చేసుకున్న సోలార్ మాడ్యూల్స్‌లో 57 శాతం ఈ మూడు దేశాల నుండే రావడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది.
ఈ టారిఫ్ నిర్ణయంతో భారత సోలార్ కంపెనీలకు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. భారత్ ఎగుమతి చేసే సోలార్ ఉత్పత్తుల్లో దాదాపు 95 శాతం అమెరికా మార్కెట్‌కే వెళ్తాయి. ఇప్పుడు 126 శాతం పన్ను పెరగడంతో, భారత సోలార్ ప్యానెళ్ల ధరలు అమెరికాలో రెట్టింపు కంటే ఎక్కువవుతాయి. దీనివల్ల భారత కంపెనీలు అమెరికా మార్కెట్ నుంచి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సిటీ గ్రూప్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ, ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తోంది.