Donald Trump : ట్రంప్ సుంకాల పవర్‌కు బ్రేక్.. అమెరికా కోర్టు షాకింగ్ తీర్పు.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తన అత్యంత శక్తివంతమైన ఆయుధమైన టారిఫ్ విషయంలో ఊహించని చట్టపరమైన ఎదురుదెబ్బ తగిలింది. ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అడ్డగోలుగా, అప్పటికప్పుడు భారీ సుంకాలు విధించే అధ్యక్షుడి అధికారాలకు కళ్లెం వేస్తూ అక్కడి కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, ఈ తీర్పు వల్ల అమెరికా మళ్లీ పాత పద్ధతిలో ఫ్రీ ట్రేడ్ (స్వేచ్ఛా వాణిజ్యం) వైపు మొగ్గు చూపుతుందని అనుకుంటే పొరపాటే. ప్రపంచ వాణిజ్య ముఖచిత్రం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం.. అధ్యక్షుడు తన ఇష్టానుసారం సుంకాలు విధించడానికి వీలుండదు. ప్రతి నిర్ణయానికి స్పష్టమైన చట్టపరమైన ఆధారం ఉండాలి. గతంలో ట్రంప్ ఒక ప్రకటన చేస్తే చాలు, ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్లు కుప్పకూలేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల విశ్లేషణ ప్రకారం.. భవిష్యత్తులో అమెరికా టారిఫ్ విధానాలు మరింత ఆలోచనాత్మకంగా, నిబంధనలకు లోబడి ఉండే అవకాశం ఉంది. భావోద్వేగాలతోనో లేదా రాజకీయ ఒత్తిడితోనో కాకుండా, సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
న్యాయస్థానం పరిమితులు విధించినప్పటికీ, అమెరికా తన స్వదేశీ పరిశ్రమలను కాపాడుకోవాలనే రక్షణవాదం అనే విధానం నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఇందులో విశేషం ఏంటంటే.. కేవలం రిపబ్లికన్లే కాకుండా, డెమోక్రాట్లు కూడా చైనా వంటి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని గట్టిగా కోరుకుంటున్నారు. సొంత దేశంలో మాన్యుఫ్యాక్చరింగ్‌ను పెంచడం, జాతీయ భద్రతను కాపాడుకోవడం అనేది ఇప్పుడు అమెరికాకు ప్రాధాన్యతగా మారింది. కాబట్టి కోర్టు తీర్పు వల్ల నిర్ణయాలు తీసుకునే పద్ధతి మారుతుందే తప్ప, సుంకాలు విధించాలనే లక్ష్యం మారదు.
ట్రంప్ దగ్గర ఇప్పటికీ కొన్ని పదునైన చట్టపరమైన అస్త్రాలు మిగిలే ఉన్నాయి. సెక్షన్ 232 లేదా సెక్షన్ 301 వంటి నిబంధనలను ఉపయోగించి, జాతీయ భద్రతకు ముప్పు ఉందని చెబితే ఇప్పటికీ సుంకాలు విధించవచ్చు. అయితే, ఇప్పుడు ఆయన తన నిర్ణయాలను ఆర్థికంగా, చట్టపరంగా బలంగా సమర్థించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కంపెనీలకు, ఇన్వెస్టర్లకు కొంత మేర ఊరట లభిస్తుంది. ఎందుకంటే అకస్మాత్తుగా నిర్ణయాలు ఉండవు కాబట్టి వారు ముందే ప్లాన్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా, ట్రంప్‌కు ఒక దెబ్బ తగిలినంత మాత్రాన ఈ సుంకాల యుద్ధం ముగిసిపోలేదు. ఇది ఒక కొత్త, క్రమబద్ధమైన వాణిజ్య యుద్ధానికి ఆరంభం మాత్రమే.