Britain: భారత సంతతి వ్యక్తి... త్వరలోనే బ్రిటన్ ప్రధాని కానున్నాడు..?
Britain: ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి కాలం దగ్గరపడిందని పలు పత్రికలు విశ్లేషిస్తున్నాయి.;
Rishi Sunak (tv5news.in)
Britain: భారత సంతతి వ్యక్తి బ్రిటన్‌ను షేక్ చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే ప్రధాని కాబోతున్నారంటూ వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి కాలం దగ్గరపడిందని పలు పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో జరుగుతోన్న బెట్టింగ్‌లు కూడా దీన్ని బలపరుస్తున్నాయి. బోరిస్ జాన్సన్ పై దేశమంతా మండిపడుతోంది.
ప్రతిపక్ష లేబర్ పార్టీయేగాక.. సొంత కన్జర్వేటివ్ పార్టీ నుంచీ ఒత్తిడి పెరిగింది. ఏడాది కిందట దేశాన్ని కొవిడ్ కుదిపేస్తున్న టైంలో అధికారిక నివాసంలో సహచరులతో కలిసి మందు పార్టీ చేసుకున్న ఘటన ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. అప్పటికే బ్రిటన్ లో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అటువంటి సమయంలో బోరిస్ పార్టీ చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చివరకు చట్టసభలో క్షమాపణలు కూడా చెప్పారు. అయినా బోరిస్ పై వ్యతిరేకత ఏమాత్రం తగ్గలేదు. ప్రధాని సీటు నుంచి దిగిపోవాల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. బోరిస్ దిగిపోతే ఆయన వారసుడు ఎవరంటే.. భారత సంతతికి చెందిన రిషి సునక్ పేరు బలంగా వినిపిస్తోంది. అందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు.
ప్రస్తుతం ఆయన బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇలాంటి ఊహాగానాలపై 'బెట్‌ఫెయిర్' అనే ఆన్‌లైన్ సంస్థ బెట్టింగ్ నిర్వహిస్తుంటుంది. బోరిస్ తప్పుకుంటే ప్రధాని రేసులో రిషి సునక్‌కు అత్యధిక మంది మద్దతు లభించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. బోరిస్ జాన్సన్‌పై నిర్వహిస్తున్న బెట్టింగ్ మార్కెట్ సూచీ.. ఈ ఏడాది చివరకు బోరిస్ తన పదవిని కోల్పోనున్నట్లు సూచిస్తోంది. వివిధ బెట్టింగ్‌లను పోల్చి చూసే 'ఆడ్స్‌చెకర్' సైతం బోరిస్ వారసుల రేసులో రిషి సునక్ ముందంజలో ఉన్నట్లు పేర్కొంది.
బోరిస్ క్షమాపణలు చెప్పడానికి ముందు 'యూగవ్' పేరిట ఓ సర్వే జరిగింది. ప్రతి పది మందిలో ఆరుగురు బోరిస్ రాజీనామా చేయాల్సిందేనన్నారు. చివరి ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి ఓటేసిన వారిలోనూ 38 శాతం మంది ఆయన పదవిని వదులుకోవాల్సిందేనని తేల్చారు. ఇక ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు బోరిస్ నిజాయతీగా సమాధానాలు ఇవ్వడం లేదని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు. వీరిలో 63 శాతం మంది కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వారే ఉండడాన్ని బట్టి బోరిస్ పై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది.