Britain New Prince : ఆయనే బ్రిటన్‌కు కొత్త రాజు..

Britain New Prince : బ్రిటన్‌ రాణి క్వీన్ ఎలిజబెత్‌-2 మరణంతో..ఆమె పెద్ద కుమారుడు, వేల్స్‌ మాజీ యువరాజు ఛార్లెస్‌ను నూతన రాజుగా అధికారికంగా ప్రకటించారు;

Update: 2022-09-10 11:00 GMT

Britain New Prince : బ్రిటన్‌ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటన్‌ రాణి క్వీన్ ఎలిజబెత్‌-2 మరణంతో..ఆమె పెద్ద కుమారుడు, వేల్స్‌ మాజీ యువరాజు ఛార్లెస్‌ను నూతన రాజుగా అధికారికంగా ప్రకటించారు. లండన్‌లోని చారిత్రక సెయింట్‌ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. 73 ఏళ్ల వయస్సులో ఛార్లెస్‌ను రాజుగా ఖరారు చేశారు.

ఛార్లెస్‌ భార్య క్వీన్‌ కాన్సర్ట్‌ కెమిల్లా కుమారుడు ప్రిన్స్‌ విలియమ్‌ సహా అతికొద్ది మంది అతిథుల సమక్షంలో రాజుగా ఛార్లెస్‌ పేరును అధికారికంగా ప్రకటించారు. ఛార్లెస్‌ను రాజుగా ప్రకటించేముందు సీనియర్ మంత్రులు, న్యాయమూర్తులు, మత పెద్దలు సమావేశమయ్యారు. ఈ భేటీలో మొదట బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ మరణాన్ని అధికారికంగా ప్రకటించారు.

తర్వాత మంత్రులంతా కొత్తరాజుకు తమ విధేయత ప్రకటించారు. తర్వాత ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఛార్లెస్‌ను రాజుగా అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆ పత్రంపై బ్రిటన్ ప్రధాని, కాంటర్‌బరీ ఆర్చిబిషప్‌, లార్డ్ ఛాన్స్‌లర్‌, పలువురు సీనియర్లు సంతకాలు చేశారు. ఇకపై ఛార్లెస్‌ను కింగ్‌ ఛార్లెస్‌-3గా పిలుస్తారు. దాదాపు 70 సంవత్సరాలకు పైగా బ్రిటన్‌ను పాలించిన ఎలిజబెత్‌-2 స్కాట్లాండ్‌లోని తన వేసవి విడిది బల్మోరల్‌ క్యాజిల్‌లో గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

Tags:    

Similar News