EPFO : పీఎఫ్ డబ్బుల కోసం ఇక తిప్పలు తప్పినట్టే..ఏప్రిల్ నుంచి యూపీఐతో పీఎఫ్ విత్ డ్రా.
EPFO : ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. తమ భవిష్యత్ అవసరాల కోసం దాచుకునే ప్రావిడెంట్ ఫండ్ డబ్బును డ్రా చేయడం ఇకపై చిటికెలో పనికానుంది. ఇప్పటి వరకు పీఎఫ్ డబ్బుల కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, వస్తున్న మార్పులతో ఇకపై కేవలం మీ UPI పిన్ ఎంటర్ చేస్తే చాలు.. నిమిషాల్లో పీఎఫ్ సొమ్ము మీ బ్యాంకు ఖాతాలోకి వచ్చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రాబోతోంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సాఫ్ట్‌వేర్‌ను భారీగా అప్‌గ్రేడ్ చేస్తోంది. దీనివల్ల దాదాపు 8 కోట్ల మంది చందాదారులకు లబ్ధి చేకూరనుంది. గతంలో పీఎఫ్ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి సమయం పట్టేది. ఆ తర్వాత దానిని మూడు రోజులకు తగ్గించారు. ఇప్పుడు నేరుగా యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ ప్రక్రియ ద్వారా ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేకుండానే డబ్బులు మీ ఖాతాలోకి చేరుతాయి. అనారోగ్యం, వివాహం, పిల్లల చదువులు లేదా సొంత ఇల్లు కొనుగోలు వంటి అత్యవసర అవసరాలకు ఈ సౌకర్యం ఎంతో ఊరటనిస్తుంది.
గతంలో ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ పరిమితి రూ.లక్ష ఉండగా, ప్రభుత్వం దానిని ఇప్పుడు ఏకంగా రూ.5 లక్షలకు పెంచింది. అంటే మూడు రోజుల్లోనే ఐదు లక్షల వరకు సొమ్మును ఎలాంటి ఆటంకం లేకుండా పొందవచ్చు. అయితే, ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును డ్రా చేయడానికి వీలుండదు. మొత్తంలో కనీసం 25 శాతం నిల్వను ఖాతాలో ఉంచాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగికి ప్రస్తుతం ఉన్న 8.25 శాతం వడ్డీ, చక్రవడ్డీ ప్రయోజనం యథావిధిగా అందుతూనే ఉంటుంది.
నిజానికి ఈపీఎఫ్ఓకు బ్యాంకింగ్ లైసెన్స్ లేదు, కాబట్టి నేరుగా బ్యాంక్ లాగా వ్యవహరించలేదు. కానీ టెక్నాలజీ ఉపయోగించి బ్యాంకుల కంటే వేగంగా సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా ఈపీఎఫ్ఓకు సుమారు 5 కోట్ల క్లెయిమ్‌లు వస్తుంటాయి. ఈ కొత్త యూపీఐ విధానం వల్ల కార్యాలయాలపై పనిభారం తగ్గడమే కాకుండా, మధ్యవర్తుల బెడద కూడా తప్పుతుంది. అక్టోబర్ 2025లో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. పీఎఫ్ విత్ డ్రా నిబంధనలను 13 కేటగిరీల నుంచి కేవలం 3 ప్రధాన కేటగిరీలుగా సులభతరం చేశారు. ఏప్రిల్ నుంచి ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ఉద్యోగుల ఆర్థిక స్వాతంత్ర్యం మరింత పెరుగుతుంది.