EPFO : ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోయాయి..యూపీఐ పిన్ కొడితే పీఎఫ్ పైసలు జేబులోకి!

Update: 2026-01-22 05:45 GMT

EPFO : భారతదేశంలోని సుమారు 8 కోట్ల మంది ఉద్యోగుల భవిష్యత్తు నిధిని పర్యవేక్షించే ఈపీఎఫ్ఓ, తన సేవలను మరింత వేగవంతం చేసేందుకు EPFO 3.0 ప్రాజెక్టును చేపట్టింది. ప్రస్తుతం ఉన్న వెబ్‌సైట్, సాఫ్ట్‌వేర్ పాతబడిపోవడంతో, కస్టమర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ తరహాలో సరికొత్త సాంకేతిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. దీనివల్ల పీఎఫ్ క్లెయిమ్‌లు సెటిల్ అయ్యే సమయం గణనీయంగా తగ్గుతుంది.

ఈ కొత్త వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భాషా అనువాద టూల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల దేశంలోని వివిధ ప్రాంతాల వారు తమ మాతృభాషలోనే పీఎఫ్ సమాచారాన్ని పొందవచ్చు. అంతేకాకుండా అసంఘటిత రంగ కార్మికులను కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో లావాదేవీల సంఖ్య పెరిగినా తట్టుకునేలా మోడ్రన్ బ్యాకెండ్ సాఫ్ట్‌వేర్‌ను ఈపీఎఫ్ఓ సిద్ధం చేస్తోంది.

అన్నింటికంటే ముఖ్యమైన మార్పు యూపీఐ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం. ఒక నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 2026 నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా చందాదారులు తమ ఖాతాలోని లిక్విడ్ బ్యాలెన్స్‎ను యూపీఐ పిన్ ఎంటర్ చేయడం ద్వారా నేరుగా తమ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. అయితే, పీఎఫ్ మొత్తంలో కొంత భాగం ఫ్రోజన్ (రిజర్వ్)గా ఉంటుంది, మిగిలిన మొత్తాన్ని అత్యవసరాల కోసం యూపీఐ ద్వారా వాడుకోవచ్చు.

ప్రస్తుతం ఈపీఎఫ్ఓ వద్ద సుమారు 28 లక్షల కోట్ల రూపాయల భారీ నిధి ఉంది. ఇంతటి పెద్ద మొత్తాన్ని నిర్వహించే క్రమంలో పారదర్శకత పెంచేందుకు ఈ డిజిటల్ మార్పులు ఎంతో కీలకం. కొత్త లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే, ఈపీఎఫ్ఓ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. మొత్తానికి టెక్నాలజీ వాడకం ద్వారా సామాన్య ఉద్యోగులకు పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి.

Tags:    

Similar News