EPFO : ఏమీ చేయక్కర్లేదు..ఇంట్లో ఖాళీగా కూర్చున్నా మీ పీఎఫ్ డబ్బులు డబుల్ అవుతాయి!
EPFO : ప్రైవేట్ రంగంలో పని చేసే వారికి ఉద్యోగం మారడం లేదా అనివార్య కారణాల వల్ల ఇంట్లోనే ఉండటం సర్వసాధారణం. ఇలాంటి సమయంలో మన భవిష్యత్తు కోసం దాచుకున్న పీఎఫ్ సొమ్ముపై వడ్డీ రాదేమోనని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఒకప్పుడు ఉద్యోగం మానేసిన మూడు సంవత్సరాల తర్వాత పీఎఫ్ ఖాతా ఇన్‌యాక్టివ్ అవుతుందని, అప్పటి నుంచి వడ్డీ ఆగిపోతుందని ఒక ప్రచారం ఉండేది. కానీ 2016లో ఈపీఎఫ్ఓ నిబంధనలను సవరించింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం, మీరు ఉద్యోగం మానేసినా, మీ అకౌంట్‌లో కొత్తగా డబ్బులు జమ కాకపోయినా.. ఉన్న పాత బ్యాలెన్స్‌పై ప్రభుత్వం వడ్డీని జమ చేస్తూనే ఉంటుంది.
చాలా మందికి ఉన్న అతిపెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే.. మూడు ఏళ్ల పాటు అకౌంట్‌లో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే వడ్డీ రాదని అనుకోవడం. నిజానికి ఈ నిబంధన కేవలం రిటైర్ అయిన వారికి మాత్రమే వర్తిస్తుంది. మీరు మధ్యలోనే ఉద్యోగం మానేసి, ఇంకో ఐదేళ్ల వరకు ఖాళీగా ఉన్నా సరే, మీ పీఎఫ్ అకౌంట్‌లోని సొమ్ముపై ఏటా ప్రకటించే వడ్డీ రేటు ప్రకారం డబ్బులు పెరుగుతూనే ఉంటాయి. మీరు 58 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మీ ఖాతాలో వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఆందోళనతో డబ్బులను వెంటనే తీసేసి, రిటైర్మెంట్ సేవింగ్స్‌ను పాడు చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
మీరు 58 ఏళ్ల వయస్సులో రిటైర్ అయిన తర్వాత కూడా, మీ పీఎఫ్ డబ్బులను క్లెయిమ్ చేయకుండా అలాగే ఉంచితే.. అప్పటి నుంచి 36 నెలల (3 ఏళ్ల) వరకు మాత్రమే వడ్డీ వస్తుంది. ఆ తర్వాతే ఆ ఖాతా ఇన్‌యాక్టివ్ గా మారుతుంది. అంటే ఉద్యోగంలో ఉండగా లేదా మధ్యలో మానేసిన వారికి ఈ ముప్పు లేదు. కేవలం పదవీ విరమణ పొందిన వారు మాత్రమే 3 ఏళ్ల లోపు తమ డబ్బులను విత్ డ్రా చేసుకోవాలి. యువత లేదా కెరీర్ మధ్యలో ఉన్నవారు తమ పీఎఫ్ డబ్బును అలాగే ఉంచడం వల్ల కాంపౌండింగ్ వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు.
ఉద్యోగం పోయిన వెంటనే ఆర్థిక ఇబ్బందుల వల్ల పీఎఫ్ డబ్బు తీయడం సహజమే. కానీ, కేవలం వడ్డీ రాదేమో అన్న అపోహతో డబ్బులు తీయడం మాత్రం పెద్ద పొరపాటే అవుతుంది. పీఎఫ్ అనేది మన వృద్ధాప్యానికి ఒక భరోసా. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ పథకంలో వచ్చే వడ్డీ రేటు కూడా ఇతర సేవింగ్స్ అకౌంట్ల కంటే ఎక్కువే ఉంటుంది. కాబట్టి, వీలైనంత వరకు ఆ సొమ్మును అలాగే ఉంచడం వల్ల మీ డబ్బు వాటంతట అదే పెరుగుతూ పోతుంది. 2016 సవరణ తర్వాత మీ ఖాతా సురక్షితంగా ఉండటమే కాకుండా లాభదాయకంగా కూడా మారింది.