Layoffs : టెక్ ప్రపంచంలో సంక్షోభం.. వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం.

Update: 2025-11-06 06:30 GMT

Layoffs : ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు ఇంకా కొనసాగుతున్నాయి. 2025 సంవత్సరం ముగింపుకు వస్తున్నా, పెద్ద టెక్ కంపెనీలలో ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ఆగడం లేదు. తాజాగా, ఈ జాబితాలో దిగ్గజ అమెరికన్ కంపెనీ ఐబీఎం పేరు కూడా చేరింది. ఐబీఎం తమ సంస్థ నుంచి వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ తొలగింపులు కంపెనీ మొత్తం గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 1% కన్నా తక్కువగానే ఉన్నప్పటికీ, ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో కొనసాగుతున్న భారీ మార్పులు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పునర్నిర్మాణంలో భాగమని తెలుస్తోంది.

అమెరికన్ టెక్ దిగ్గజం ఐబీఎం తమ సంస్థలో వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ధృవీకరించింది. ఐబీఎం ఈ చర్యను తమ రెగ్యులర్ వర్క్‌ఫోర్స్ రివ్యూ ప్రాసెస్‎లో భాగంగా పేర్కొంది. కంపెనీ తన వనరులను ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవసరానికి అనుగుణంగా సర్దుబాట్లు చేస్తుందని తెలిపింది. ఈ తొలగింపులు కంపెనీ మొత్తం ప్రపంచ ఉద్యోగుల సంఖ్యలో ఒక శాతం కంటే తక్కువగానే ఉంటాయని ఐబీఎం పేర్కొంది. 2024 చివరి నాటికి ఐబీఎంలో సుమారు 2.7 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ తాజా కోత ప్రభావం అమెరికాలో పనిచేసే ఉద్యోగులపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఐబీఎం ప్రస్తుతం తన పూర్తి దృష్టిని సాఫ్ట్‌వేర్, క్లౌడ్ సర్వీసులు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాలపై కేంద్రీకరించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే వృద్ధి రేటు నెమ్మదించిన విభాగాలలో తొలగింపులు జరుగుతున్నాయి. ఈ లేఆఫ్స్ ప్రకటనకు ఒక నెల ముందు, కంపెనీ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ విభాగం వృద్ధిలో స్లో డౌన్ కనిపించిందని ఒక నివేదిక తెలిపింది. ఈ వార్త నేపథ్యంలో ఐబీఎం షేర్లు స్వల్పంగా తగ్గాయి. అయితే, ఈ సంవత్సరం ఇప్పటివరకు కంపెనీ షేర్లు 35% వరకు పెరగడం గమనార్హం.

ఐబీఎం ఒక్కటే కాకుండా, ప్రపంచ టెక్ రంగం అంతటా ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. Layoffs.fyi వెబ్‌సైట్ అందించిన డేటా ప్రకారం, 2025 సంవత్సరంలో ఇప్పటివరకు 218 టెక్ కంపెనీలు 1,12,732 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ఐబీఎంతో పాటు అమెజాన్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా తమ కార్యకలాపాలను పునర్నిర్మించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇటీవల అమెజాన్ కూడా ప్రపంచవ్యాప్తంగా తన వర్క్‌ఫోర్స్ నుంచి సుమారు 14,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభావిత ఉద్యోగులకు కంపెనీలో మరో ఉద్యోగం వెతుక్కోవడానికి 90 రోజుల ట్రాన్సిషన్ పీరియడ్ ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది.

Tags:    

Similar News