Best Boss Ever : మంచి మనసున్న బాస్..కంపెనీని అమ్మేసి ఉద్యోగులకు రూ.2000 కోట్లు పంచేశాడు.
Best Boss Ever : సాధారణంగా కంపెనీలు అమ్ముడైతే యజమానులు వేల కోట్లు వెనకేసుకుంటారు.. కానీ పని చేసే ఉద్యోగుల భవిష్యత్తు మాత్రం అగమ్యగోచరంగా మారుతుంది. కానీ అమెరికాలోని లూసియానాలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలోనే అతిపెద్ద సంచలనంగా మారింది. తన కంపెనీని విక్రయించిన ఒక యజమాని, తనకు వచ్చిన లాభం నుంచి ఏకంగా రూ.2,000 కోట్లను తన ఉద్యోగులకు పంపిణీ చేశాడు. దీంతో ఆ కంపెనీలో పనిచేసే సుమారు 450 మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. ఒక మంచి మనసున్న బాస్ తలుచుకుంటే సామాన్యుల జీవితాలు ఎలా మారతాయో చెప్పడానికి ఈ కథే ఒక నిదర్శనం.
వందల కోట్లు.. అది కూడా గిఫ్ట్ గా
అమెరికాకు చెందిన ఫైబర్‌బాండ్ కంపెనీ సీఈఓ గ్రాహం వాకర్ తన వ్యాపారాన్ని ప్రముఖ దిగ్గజ సంస్థ ఈటన్ కు విక్రయించారు. అయితే ఈ డీల్ కుదుర్చుకునే ముందే వాకర్ ఒక వింత షరతు పెట్టారు. తన కంపెనీ అభివృద్ధి కోసం రక్తాన్ని చెమటగా మార్చిన ఉద్యోగులకు అమ్మకపు సొమ్ములో వాటా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం ఒక్కో ఉద్యోగి ఖాతాలో సగటున రూ.3.7 కోట్లు (4.43 లక్షల డాలర్లు) వచ్చి పడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఉద్యోగులకు కంపెనీలో ఎలాంటి షేర్లు లేవు, కేవలం వారి నమ్మకానికి, కష్టానికి ప్రతిఫలంగానే వాకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అప్పులు తీరిపోయాయి.. కలలు నిజమయ్యాయి
ఈ బోనస్ సొమ్ము అందడంతో వందలాది కుటుంబాల తలరాతలు మారిపోయాయి. 1995లో కేవలం గంటకు 5 డాలర్ల జీతంతో చేరిన ఒక మహిళా ఉద్యోగి, ఈ డబ్బుతో తన ఇంటి లోన్ మొత్తం తీర్చేసి, సొంతంగా ఒక బట్టల బొటిక్ ప్రారంభించింది. మరికొందరు తమ పిల్లల కాలేజీ ఫీజులు కట్టగా, ఇంకొందరు తమ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. “ఇది వారి డబ్బు, వారు ఎలాగైనా వాడుకోవచ్చు” అంటూ వాకర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ డబ్బును ఒకేసారి కాకుండా, ఉద్యోగులు కంపెనీలో కొనసాగేలా ఐదేళ్ల పాటు వాయిదాల పద్ధతిలో అందించనున్నారు.
కష్టకాలంలోనూ అండగా నిలిచిన కంపెనీ
1982లో గ్రాహం వాకర్ తండ్రి క్లాడ్ వాకర్ ఈ కంపెనీని స్థాపించారు. ఈ 42 ఏళ్ల ప్రయాణం పూల బాట ఏమీ కాదు. 1998లో ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగి సర్వస్వం కాలిపోయినా, ఒక్క ఉద్యోగి జీతాన్ని కూడా ఆపలేదు. ఆర్థిక మాంద్యం సమయంలో కూడా వాకర్ సోదరులు కంపెనీని చాకచక్యంగా నడిపించి, ఆదాయాన్ని 400 శాతం పెంచారు. ఇప్పుడు కంపెనీ చేతులు మారుతున్న సమయంలో, తమ విజయానికి కారణమైన ఉద్యోగులను వాకర్ కుటుంబం ఇలా గౌరవించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలాంటి యజమాని ప్రతి ఒక్కరికీ ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.