UAN Merger Process : ఒకటి కంటే ఎక్కువ UAN నంబర్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
UAN Merger Process : ప్రతి ఉద్యోగికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) చాలా కీలకం. ఇది పాన్ కార్డు లాగే ఒక ప్రత్యేకమైన 12 అంకెల సంఖ్య. అయితే, ఉద్యోగాలు మారే క్రమంలో పాత కంపెనీకి సంబంధించిన వివరాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల, చాలా మంది ఉద్యోగులకు ఒకటి కంటే ఎక్కువ యూఏఎన్ నంబర్లు లేదా ఎక్కువ ఈపీఎఫ్ ఖాతాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ యూఏఎన్ నంబర్లు ఉండటం అనేది నియమాలకు విరుద్ధం, ఇది భవిష్యత్తులో పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునేటప్పుడు సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి, మీకు ఒకటి కంటే ఎక్కువ యూఏఎన్ లేదా ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నట్లయితే వాటిని ఎలా విలీనం చేయాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక వ్యక్తి ఉద్యోగం మారిన ప్రతిసారీ పాత యూఏఎన్ నంబర్‌ను కొత్త కంపెనీకి తెలియజేయడం తప్పనిసరి. అలా చేయకపోతేనే సమస్యలు తలెత్తుతాయి. మీరు ఉద్యోగం మారిన ప్రతిసారీ, పాత యూఏఎన్ కింద కొత్త ఈపీఎఫ్ ఖాతా ఏర్పడుతుంది. ఒకవేళ మీరు మీ పాత యూఏఎన్ను కొత్త కంపెనీకి ఇవ్వకపోతే, కొన్నిసార్లు కొత్త యూఏఎన్ నంబర్ కూడా జెనరేట్ అవుతుంది. ఒక ఉద్యోగికి రెండు యూఏఎన్ నంబర్లు ఉండటం అనేది నిబంధనలకు విరుద్ధం. ఒకటి కంటే ఎక్కువ యూఏఎన్లు ఉన్నట్లయితే, భవిష్యత్తులో పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడంలో తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. అందుకే వాటిని వెంటనే విలీనం చేయాలి.
నిష్క్రియం చేసే విధానం
మీరు ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలోని హెచ్‌ఆర్ విభాగానికి ఈ విషయాన్ని వెంటనే తెలియజేయాలి. లేదా, మీరు మీ వివిధ యూఏఎన్ లను పేర్కొంటూ uanepf@epfindia.gov.in అనే చిరునామాకు ఇమెయిల్ పంపవచ్చు. EPFO (Employees' Provident Fund Organisation) మీ దరఖాస్తును పరిశీలించి, పాత యూఏఎన్ లను డీయాక్టివేట్ చేస్తుంది. పాత యూఏఎన్ డీయాక్టివేట్ అయిన తర్వాత, దాని కింద ఉన్న ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను కొత్త యూఏఎన్ కు బదిలీ చేయడానికి మీరు క్లెయిమ్ను దాఖలు చేయవచ్చు.
ఈపీఎఫ్ ఖాతాలు విలీనం చేసే పద్ధతి
యూఏఎన్ ఒక్కటే ఉండి, వివిధ కంపెనీల నుంచి వచ్చిన పాత ఈపీఎఫ్ ఖాతాలు ఉంటే, వాటిని విలీనం చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. పీఎఫ్ సబ్‌స్క్రైబర్‌లు ముందుగా ఈపీఎఫ్ఓ సభ్యుల పోర్టల్‌లోకి తమ యూఏఎన్, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ కావాలి. అక్కడ మీకు మీ ప్రస్తుత కంపెనీ, పాత కంపెనీలకు సంబంధించిన ఈపీఎఫ్ ఖాతాల జాబితా కనిపిస్తుంది. ప్రస్తుత ఖాతాలోకి పాత ఖాతా బ్యాలెన్స్‌ను విలీనం చేయమని కోరుతూ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ను సమర్పించాలి. సాధారణంగా ఈ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ పూర్తవడానికి 10 నుంచి 15 పనిదినాలు పట్టవచ్చు. ఆ తర్వాత పాత ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బు కొత్త ఖాతాలోకి బదిలీ అవుతుంది.
ఈపీఎఫ్ ఖాతాలను విలీనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
పాత ఈపీఎఫ్ ఖాతాలను విలీనం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కంపెనీ నుంచి, మీ నుంచి ఎలాంటి మొదటి కంట్రిబ్యూషన్ జమ కాకుండా నిలిచిపోయిన ఈపీఎఫ్ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. డీయాక్టివేట్ అయిన ఖాతాలకు ప్రభుత్వం నుంచి సంవత్సరానికి లభించే వడ్డీ జమ కాదు. కేవలం యాక్టివ్ గా ఉన్న ఖాతాకు మాత్రమే వడ్డీ క్రెడిట్ అవుతుంది. కాబట్టి, పాత ఖాతాలను విలీనం చేయడం వల్ల మీ మొత్తం పీఎఫ్ నిల్వపై వడ్డీ లభిస్తుంది. విత్‌డ్రా సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా డబ్బును పొందవచ్చు.