New Labour Codes : ఉద్యోగులకు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్: కొత్త లేబర్ కోడ్‌తో జీతంలో మార్పులు!
New Labour Codes : దేశవ్యాప్తంగా జీతం తీసుకునే ఉద్యోగులందరికీ నవంబర్ 21, 2025 నుంచి ఒక పెద్ద మార్పు మొదలైంది. కొత్త లేబర్ కోడ్ అమలులోకి వచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం ఉద్యోగి బేసిక్ సాలరీ, డీఏ, రిటైనింగ్ అలవెన్స్ మొత్తం కలిపి, ఆ ఉద్యోగి కాస్ట్ టు కంపెనీలో కనీసం 50% ఉండాలి. తకుముందు చాలా కంపెనీలు బేసిక్ శాలరీని తక్కువగా చూపించి, అలవెన్స్‌లను ఎక్కువగా ఇచ్చేవి. ఇప్పుడు బేసిక్ శాలరీ పెంచడం తప్పనిసరి అవుతుంది. దీని కారణంగా పీఎఫ్, ఎన్‌పీఎస్, గ్రాట్యుటీ వంటి చట్టబద్ధమైన ప్రయోజనాలకు ఉద్యోగి, కంపెనీ అందించే వాటా పెరుగుతుంది. ఎందుకంటే ఈ వాటాలు బేసిక్ శాలరీపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి పీఎఫ్ కటింగ్ పెరగడం వల్ల, మీకు నెలవారీగా చేతికి వచ్చే జీతంలో కొంత తగ్గుదల కనిపిస్తుంది.
ఈ మార్పులో ఒక పెద్ద లాభం కూడా ఉంది. బేసిక్ జీతం పెరగడం వల్ల మీ ట్యాక్స్ భారం బాగా తగ్గుతుంది. ఉదాహరణకు, మీ వార్షిక CTC రూ.15 లక్షలు ఉంటే, కొత్త రూల్ ప్రకారం మీరు ఏడాదికి దాదాపు రూ.75,871 వరకు ట్యాక్స్ ఆదా చేయవచ్చు. రూ.20 లక్షలు, రూ.25 లక్షల ప్యాకేజీ ఉన్న ఉద్యోగులు కూడా వేలల్లో ట్యాక్స్ సేవింగ్స్ పొందుతారు. టేక్-హోమ్ శాలరీ కొద్దిగా తగ్గినప్పటికీ ఇది ట్యాక్స్ పరంగా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని జీతం స్లాబ్‌లపై ఈ మార్పు ఎలా ఉంటుందో ఒక అంచనా
రూ.15 లక్షల CTC: నెలకు టేక్-హోమ్ శాలరీలో సుమారు రూ.4,380 తగ్గుతుంది, కానీ సంవత్సరానికి రూ.75,871 ట్యాక్స్ ఆదా అవుతుంది.
రూ.25 లక్షల CTC: నెలకు టేక్-హోమ్ శాలరీలో సుమారు రూ.14,500 తగ్గుతుంది, కానీ సంవత్సరానికి దాదాపు రూ.40,053 ట్యాక్స్ ఆదా అవుతుంది.
ఈ కొత్త నిబంధనల వల్ల మీ రిటైర్మెంట్ ఫండ్ చాలా బలంగా మారుతుంది. అధిక బేసిక్ జీతం అంటే, పీఎఫ్, ఎన్‌పీఎస్‌లలో ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లే. ఇది దీర్ఘకాలంలో ఒక పెద్ద ఫండ్‌ను తయారు చేస్తుంది. అంతేకాకుండా బేసిక్ శాలరీ పెరగడం వల్ల రిటైర్మెంట్ సమయంలో లేదా ఉద్యోగం మానేసినప్పుడు ఎక్కువ గ్రాట్యుటీ కూడా లభిస్తుంది. కాబట్టి కొత్త లేబర్ కోడ్ నెలవారీ ఆదాయాన్ని కొద్దిగా తగ్గించినా, మీ భవిష్యత్తును సురక్షితం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.