New Labour Code 2026 : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అమల్లోకి కొత్త లేబర్ కోడ్.. ఇక కంపెనీల ఆటలు సాగవు.

Update: 2026-02-21 07:00 GMT

New Labour Code 2026 : ప్రైవేట్ ఉద్యోగుల దశ తిరగబోతోంది. కార్పొరేట్ కంపెనీల్లో పని చేసే లక్షలాది మంది ఉద్యోగుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. పాతకాలపు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను అమల్లోకి తెచ్చింది. ఇకపై కంపెనీలు తమ ఇష్టానుసారం రూల్స్ మార్చడం కుదరదు. ఉద్యోగుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సుమారు రెండు డజన్ల కఠినమైన నిబంధనలతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. వీటిని అమలు చేయడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కంపెనీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

జీతం నుంచి భద్రత వరకు.. అన్నీ పక్కా

కొత్త చట్టాల ప్రకారం కంపెనీలకు ప్రభుత్వం ఒక వివరణాత్మక హ్యాండ్‌బుక్‎ను అందిస్తోంది. ఏ కంపెనీ కూడా నిబంధనల విషయంలో మాకు తెలియదనే సాకు చెప్పడానికి వీల్లేకుండా ఈ లిస్ట్ ఉంటుంది. కొత్త ఉద్యోగి చేరిన మొదటి రోజు నుంచే ఏడు ప్రాథమిక నియమాలను కంపెనీలు పాటించాలి. ప్రతి నెలా ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు ఇవ్వడంతో పాటు, పీఎఫ్, ఈఎస్ఐ నిధులను నిర్ణీత గడువులోగా జమ చేయాలి. అంతేకాదు, ప్రతి ఉద్యోగికి విధిగా శాలరీ స్లిప్ ఇవ్వడం ఇకపై తప్పనిసరి.

ఉద్యోగం మానేస్తే.. రెండేళ్లలో సెటిల్‌మెంట్

ఒకవేళ ఉద్యోగి రాజీనామా చేసినా లేదా కంపెనీ తొలగించినా, వారి పూర్తి సెటిల్‌మెంట్ విషయంలో కంపెనీలు ఇకపై జాప్యం చేయలేవు. ఉద్యోగి వెళ్ళిపోయిన రెండు రోజుల్లోపు పూర్తి లెక్కలు తేల్చి డబ్బులు ఇచ్చేయాలి. గ్రాట్యుటీని 30 రోజుల్లోగా అందజేయాలి. అలాగే, 300 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు.. లేఆఫ్స్ చేయాలన్నా లేదా కంపెనీని మూసివేయాలన్నా ముందస్తుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. పని చేసే చోట ఏదైనా ప్రమాదం జరిగితే కేవలం 24 నుండి 72 గంటల్లోపు అధికారులకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.

40 దాటిన వారికి ఉచిత హెల్త్ చెకప్

కొత్త లేబర్ కోడ్‌లో ఉద్యోగుల ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ కంపెనీలు తమ స్వంత ఖర్చుతో ప్రతి ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించాలి. వార్షిక ప్రాతిపదికన కనీస వేతన రేట్లను అప్‌డేట్ చేయడం, పని ప్రదేశంలో భద్రతా ఆడిట్ నిర్వహించడం కూడా కంపెనీల బాధ్యత. ప్రసూతి ప్రయోజనాల నిబంధనలు కూడా మునుపటి కంటే మరింత కఠినంగా అమలు కానున్నాయి. ఈ మార్పుల వల్ల ప్రైవేట్ రంగంలో ఉద్యోగ భద్రత పెరగడమే కాకుండా, యజమాని-ఉద్యోగి మధ్య వివాదాలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News