Income Tax : టాక్స్ పేయర్లకు అలర్ట్.. ఫారమ్ 16 పేరు మారుతోంది.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్

Update: 2026-02-19 14:15 GMT

Income Tax :ఆదాయపు పన్ను శాఖ తాజాగా సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్కమ్ టాక్స్ యాక్ట్ 2025ను ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేందుకు వీలుగా డ్రాఫ్ట్ ఇన్కమ్ టాక్స్ రూల్స్ 2026ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల వల్ల పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా ఉద్యోగులు వాడే ఫారమ్‌లలో భారీ మార్పులు రాబోతున్నాయి. పన్ను విధానాన్ని మరింత సరళీకృతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మార్పుల్లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. దశాబ్దాలుగా మనం వాడుతున్న ఫారమ్‌ల పేర్లు మారిపోతున్నాయి. ఉద్యోగులకు అత్యంత కీలకమైన ఫారమ్ 16 ఇకపై ఫారమ్ 130గా మారనుంది. అలాగే, మన పన్ను లావాదేవీలన్నీ కనిపించే ఫారమ్ 26AS పేరు ఫారమ్ 168గా మారబోతోంది. అయితే, కేవలం ఫారమ్ నంబర్లు మాత్రమే మారుతున్నాయని, పన్ను విధివిధానాల్లో లేదా పాలసీలలో ఎలాంటి మార్పు లేదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు.

మరో ముఖ్యమైన మార్పు టాక్స్ ఇయర్ విషయంలో జరిగింది. ఇప్పటి వరకు మనకు ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని రెండు రకాల టెర్మ్స్ ఉండేవి. ఇవి సామాన్యులను ఎప్పుడూ అయోమయానికి గురిచేస్తూనే ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్‌కు చెక్ పెడుతూ.. ఇకపై కేవలం టాక్స్ ఇయర్ అనే పదాన్నే వాడనున్నారు. ఉదాహరణకు, కొత్త ఫారమ్‌లలో నేరుగా టాక్స్ ఇయర్ 2026-27 అని ఉంటుంది. దీనివల్ల సామాన్య పన్ను చెల్లింపుదారులకు లెక్కలు అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది.

ప్రస్తుతం ఈ నిబంధనలు ముసాయిదా దశలో ఉన్నాయి. దీనిపై పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను ఫిబ్రవరి 22 వరకు తెలియజేయవచ్చు. అందరి సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, మరో ఒకటి రెండు నెలల్లో తుది నిబంధనలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కొత్త ఫారమ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News