TCS Layoff : TCSలో ఉద్యోగాల ఊచకోత..ఆరు నెలల్లోనే 30 వేల మంది ఇంటికి.

Update: 2026-01-14 07:30 GMT

TCS Layoff : భారతీయ ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న టీసీఎస్ ఇప్పుడు తన ఉద్యోగుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. గత ఆరు నెలల కాలంలోనే ఏకంగా 30,000 మందికి పైగా ఉద్యోగులకు టీసీఎస్ ఉద్వాసన పలికింది. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే.. నిఫ్టీ-50 లోని కొన్ని దిగ్గజ కంపెనీల మొత్తం ఉద్యోగుల సంఖ్య కంటే, టీసీఎస్ బయటకు పంపిన వారి సంఖ్యే ఎక్కువ. ఈ భారీ తొలగింపులు ఐటీ రంగంలో పెను సంచలనంగా మారాయి.

ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు డిమాండ్ తగ్గడం, కంపెనీ లాభాల్లో క్షీణత కనిపించడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ రాకతో పాత పద్ధతుల్లో పనిచేసే ఉద్యోగుల అవసరం తగ్గుతోంది. గత జూలైలోనే టీసీఎస్ తన మొత్తం సిబ్బందిలో 2 శాతం వరకు కోత విధిస్తామని చెప్పింది. ఇప్పుడు అదే అమలు చేస్తూ, పనితీరు సరిగా లేని లేదా అవసరం లేని రోల్స్‌ను గుర్తించి వారిని తొలగిస్తోంది. గత త్రైమాసికంలోనే సుమారు 11 వేల మందిని పంపించివేసింది.

ఈ తొలగింపుల ప్రభావం కేవలం ఫ్రెషర్లపైనే కాదు, మిడిల్, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి అధికారులపై కూడా పడింది. కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి సుమారు 12,000 కీలక పోస్టులను అవసరం లేదని టీసీఎస్ గుర్తించింది. దీంతో ప్రస్తుతం టీసీఎస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 5.8 లక్షలకు పడిపోయింది. కంపెనీ నికర లాభం కూడా సుమారు 14 శాతం వరకు పడిపోవడంతో, ఖర్చులు తగ్గించుకోవడం మినహా మరో మార్గం లేదని యాజమాన్యం భావిస్తోంది.

టీసీఎస్ లాంటి కంపెనీలే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయంటే, భవిష్యత్తులో ఐటీ రంగం పూర్తిగా ఏఐ వైపు మళ్లుతోందని అర్థమవుతోంది. ఉద్యోగులు పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే మరిన్ని తొలగింపులు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తన క్లయింట్లకు ఇచ్చే సేవలలో ఎలాంటి లోటు ఉండదని టీసీఎస్ చెబుతున్నప్పటికీ, ఈ భారీ లే-ఆఫ్స్ ఉద్యోగుల్లో మాత్రం అభద్రతా భావాన్ని నింపుతున్నాయి.

Tags:    

Similar News