ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు!
ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లో వానలు పడే అవకాశం;
ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 26న ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో నాలుగు రోజుల క్రితం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఏపీకి దూరంగా పయనించి పశ్చిమ రాజస్థాన్ మధ్య భాగం, దాని పరిసరాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అయితే ఈ సీజన్‌లో వర్షాలపై ప్రభావం చూపే రుతుపవనద్రోణి దక్షిణవైపుగా కొనసాగడంతో ఏపీలో అనేకచోట్ల మేఘాలు ఆవరించాయి. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.