Paradha Movie Review : పరదా మూవీ కంప్లీట్ రివ్యూ

Update: 2025-08-22 09:15 GMT

రివ్యూ : పరదా

ఆర్టిస్ట్స్ : అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, హర్ష వర్ధన్, రాగ్ మయూర్, గౌతమ్ మీనన్, సుధాకర్ రెడ్డి తదితరులు

ఎడిటర్ : ధర్మేంద్ర కాకరాల

సంగీతం : గోపీ సుందర్

సినిమాటోగ్రఫీ : మృదుల్ సుజిత్ సేన్

నిర్మాతలు : శ్రీనివాసులు పి.వి, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ

దర్శకత్వం : ప్రవీణ్ కాండ్రేగుల

కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ తెలుగులో బాగా తగ్గిపోయాయి. అప్పుడప్పుడూ వస్తున్నా.. ఆడియన్స్ ను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ కావడం లేదు. అయితే మొదటి నుంచీ ఈ తరహా మూవీస్ తోనే ఆకట్టుకుంటున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మరోసారి పరదా అనే కాన్సెప్ట్ తో వచ్చాడు. ఈ సారి తనకు అనుపమ, దర్శన, సంగీత రూపంలో స్ట్రాంగ్ కాస్టింగ్ కూడా లభించింది. మరి ఈ పరదా ఎలా ఉంది అనేది చూద్దాం..

కథ :

ఆంధ్రప్రదేశ్ లోని ‘పడతి’అనే ఓ గ్రామంలో తరాలుగా ఒక ఆచారం ఉంటుంది. వయసుకు వచ్చిన ప్రతి ఆడపిల్ల ఖచ్చితంగా తన వేరే మగవారికి కనిపించకుండా మొహంపై ముసుగు ధరించాలి. తన మొహం కేవలం భర్త, సోదరులు, తండ్రి మాత్రమే చూడాలి. తను కూడా వారిని తప్ప ఇంకే మగవాడినీ చూడకూడదు. కాదని ఎవరైనా ముసుగు తీస్తే.. వారు నమ్మే జ్వాలాముఖి అమ్మవారు ఆగ్రహిస్తారు. దీంతో ఆ ఊరిలో పుట్టే పిల్లలంతా చనిపోతారు అనే మూఢ నమ్మకం ఉంటుంది. అందుకే ముసుగు తీసిన వారిని స్వచ్ఛంద మరణం తప్పదు. అదే ఊరిలో ఉండే సుబ్బలక్ష్మి ఆ ఊరి ప్రెసిడెంట్ కొడుకును ప్రేమిస్తుంది. సరిగ్గా పెళ్లి టైమ్ కు సుబ్బుకు సంబంధించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. ఈ కారణంగా తను ఏకంగా ప్రాణత్యాగానికీ సిద్ధం కావాల్సి వస్తుంది. మరి ఆ ఘటన ఏంటీ..? తన ప్రాణాలు కోల్పోయిందా..? ఆ ఊరి నుంచి ధర్మశాల వరకూ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. ఈ ప్రయాణంలో ఆమెకు రత్న(సంగీత) అమిష్ట( దర్శన)ల సహకారం ఎలా ఉంది..? అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

పరదా.. టైటిల్ తో పాటు ట్రైలర్ చూసినప్పుడే మాగ్జిమం కాన్సెప్ట్ అర్థమవుతుంది. అయితే ఇది కేవలం స్త్రీ మొహానికి మాత్రమే వేసిన పరదా కాదు. ఆమె స్వేచ్ఛకు కూడా వేసిన పరదా అని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. అంటే ఒక చోట ఒక క్లాత్ తో మొహాన్ని కప్పేస్తే మరో చోట ఆధిపత్యమో, నిర్బంధమో, అబల అనే ట్యాగ్ వల్లనో.. ఆడవాళ్లు ఏం చేయలేరు అనే చులకన భావం లాంటి అనేక పరదాలు సమాజం అంతా ఉన్నాయని చెబుతాడు. ఇది అర్థం కావాలంటే కాస్త డీప్ గా సినిమా చూడాల్సి ఉంటుంది. నిజానికి మను ధర్మశాస్త్రంలో చెప్పినట్టు స్త్రీ పెళ్లికి ముందు వరకు తండ్రి ఆధీనంలో ఉండాలి, పెళ్లి తర్వాత భర్త ఆధీనంలో ఉండాలి, ఆపై కొడుకుల ఆధీనంలోనే ఉండాలి. అది ఇప్పటికీ అప్లై అవుతుంది. రకరకాల పరదా మాటున స్త్రీ స్వేచ్ఛను కాలరాస్తున్నారనే స్టేట్మెంట్ ను ఈ పరదా మాటున చెప్పాడు దర్శకుడు. అదే టైమ్ లో మితిమీరిన స్వేచ్ఛ కూడా అక్కర్లేదంటాడు. తను అనుకున్నది సాధించిన తర్వాత కూడా స్త్రీ అన్నీ చేయాలనుకుంటుంది.. అని ఒక లేడీ ఆర్మీ ఆఫీసర్ తో చెప్పించిన సీన్ బావుంది. అంటే ఒకరి అభిప్రాయమే ఆ సమూహం అభిప్రాయం కాదు. ఒపీనియన్ అనేది వ్యక్తిగతం అనే పాయింట్ ఆమె కోణంలో చెప్పడం ఆకట్టుకుంటుంది. ఓ రకంగా ఇది పూర్తిగా దర్శకుడి స్టేట్మెంట్స్ లాంటి సినిమాగానే చెప్పాలి. ఓ సాధారణ గ్రామీణ స్త్రీ టీచర్ కావాలనే కోరికను ఆమె ప్రేమించిన వాడే కొట్టి పడేయడం.. ఓ గృహిణిని పూర్తిగా ఆమెకు వంటింటికే పరిమితం చేయడం.. బాగా చదువుకుని ఆధునిక భావాలూ, అత్యంత ప్రతిభ ఉన్న ఇంజినీర్ కేవలం ఆడది అనే కారణంతో ఆమెకు దక్కాల్సిన గుర్తింపును కాల రాయడం.. ఇవన్నీ సమాజంలోని రకరకాల వర్గాలకు అద్దం పట్టేవే. చివరికి నమ్మకం, మూఢ నమ్మకం మధ్య ఉన్న గీతను చెరిపేస్తూ ఆ ఊరిని పరదా అనే దురాచారాన్నుంచి విముక్తి చేయడంతో ముగుస్తుంది.

అయితే సినిమా మొదలైన విధానం బావుంది. కానీ కథనంలో తడబాట్లు కనిపిస్తాయి. గ్రామంలో జరిగే తంతు ఇంకాస్త గ్రిప్పింగా ఉండాల్సింది అనిపిస్తుంది. అలాగే జ్వాలాంబిక అమ్మవారి ఎపిసోడ్ తోలుబొమ్మలాటతో చెప్పడం వల్ల అంత ఎఫెక్టివ్ గా కనిపించలేదు. దర్శన పాత్ర ఎంట్రీ తర్వాత కాస్త ఫన్ మోడ్ లోకి వెళ్లినా.. ఆ ప్రయాణం మరీ సుదీర్ఘంగా ఉండటంతో చూస్తున్నవారిలో నిట్టూర్పులు తప్పవు. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే అనుకున్నంత గొప్పగా కనిపించదు. చాలా వరకూ ముందే ఊహించేలా కనిపిస్తుంది. గెస్ట్ పాత్రలో కనిపించిన రాజేంద్ర ప్రసాద్ తో చెప్పించిన పక్షి, స్వేచ్ఛ కాన్సెప్ట్ అసంబద్ధంగా ఉంది.

నటన పరంగా చూస్తే అనుపమ కెరీర్ లో ఇదో బెస్ట్ రోల్. అద్భుతంగా చేసింది. తన పరదా గురించి ఫ్రస్ట్రేట్ అయిన సందర్భంలో ఆమె నటన పీక్స్ లో కనిపిస్తుంది. అటు దర్శన సైతం గొప్పగా నటించింది. సంగీత మరోసారి తనదైన శైలిలో సూపర్బ్ పర్ఫార్మెన్స్ తో సినిమాలో అత్యంత కీలకంగా కనిపిస్తుంది. సంగీత భర్తగా హర్ష వర్ధన్ మరోసారి అదరగొట్టాడు. అనుపమ లవర్ పాత్రలో రాగ్ మయూర్ ఓకే. అనుపమ తండ్రిగా సుధాకర్ మెప్పించాడు. మిగతా పాత్రలన్నీ రొటీన్.

టెక్నికల్ గా చాలా బావుంది. గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ చాలా బావుంది. పాటలన్నీ సూపర్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ బావున్నాయి. కాస్ట్యూమ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా ప్రవీణ్ మొదట ‘సినిమా బండి’తో ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా సమంత నిర్మించిన శుభంతో విజయం అందుకున్నాడు. కొన్ని తడబాట్లు ఉన్నా.. పరదా సైతం మెప్పించే సినిమా. ఇలాంటి కథలు ఇంకా రావాలి అనేందుకు నిదర్శనంగా కనిపించేలా రాసుకున్నాడు. తీశాడు.

ఫైనల్ గా : స్త్రీ స్వేచ్ఛపై కప్పిన పరదా

రేటింగ్ : 2.5/5

- బాబురావు. కామళ్ల


Full View

Tags:    

Similar News