Raayan Movie Review : రాయన్ మూవీ రివ్యూ

Update: 2024-07-26 11:34 GMT

రివ్యూ : రాయన్

తారాగణం : ధనుష్, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, అపర్ణా బాలమురళి, దుషారా విజయన్, ఎస్.జే సూర్య, సెల్వ రాఘవన్ తదితరులు..

ఎడిటర్ : ప్రసన్న జికే

సంగీతం : ఏఆర్ రెహమాన్

సినిమాటోగ్రఫీ : ఓమ్ ప్రకాష్

నిర్మాత : కళానిధి మారన్

రచన, దర్శకత్వం : ధనుష్

తమిళ్ నటుడు ధనుష్ వై దిస్ కొలవెరి అనే సాంగ్ తో దేశవ్యాప్తంగా ఎప్పుడో పాపులర్ అయ్యాడు. అంతకు ముందే నటుడుగా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకత్వం కూడా చేయగల టాలెంట్ ఉన్న ధనుష్ అంటే అన్ని భాషల ప్రేక్షకులకూ ఇష్టం. తను స్టార్ మాత్రమే కాదు. స్టార్ యాక్టర్ కూడా. అంటే ఇమేజ్ మాయలో పడిపోకుండా తన స్టార్డమ్ తగ్గకుండా ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోగలవాడు అన్నమాట. అలాంటి ధనుష్ కెరీర్ లో 50వ సినిమా అంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుందనుకుంటాం కదా. పైగా ఈ చిత్రానికి తనే దర్శకుడు అన్నప్పుడు మాస్ మొత్తం విజిల్స్ కొట్టేలా ఉంటుందనుకుంటాం. మరి ఈ శుక్రవారం విడుదలైన అతని 50వ సినిమా రాయన్ ఎలా ఉందో చూద్దాం.

కథ :

ఒకానొక పల్లెటూరిలో ముగ్గురు కొడుకుల తర్వాత కూతురుకు జన్మనిస్తుందో జంట. ఈ పాపకు ఇంటికి పెద్దవాడైన కార్తవ రాయన్(ధనుష్ ) దుర్గ అని పేరు పెడతాడు. మిగతా ఇద్దరూ ముత్తు రాయన్( సందీప్ కిషన్), మాణిక్య రాయన్ ( కాళిదాస జయరాం). వీళ్లు పిల్లలుగా ఉండగానే ఓ రోజు టౌన్ కు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగిరారు. వారికేమైందో తెలియక ఊరి పూజారి వద్దకు వెళితే అతను వీరి చెల్లిని అమ్మకానికి పెడతాడు. ఆ పూజారిని చంపి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లితో సిటీకి చేరతాడు రాయన్. అక్కడ శేఖర్( సెల్వ రాఘవన్ ) అనే లారీ డ్రైవర్ సాయంతో పని వెదుక్కుని ముగ్గురినీ కంటికి రెప్పలా చూసుకుంటాడు. పెద్దయ్యాక మార్కెట్ లోనే జంక్ ఫుడ్ బండి పెట్టుకుని బ్రతుకుతుంటారు. వీరిలో ముత్తు కాస్త దుడుకు వాడు. అతని వల్ల ఊరిలో పెద్ద గ్యాంగ్ స్టర్ అయిన దురైతో రాయన్ కు గొడవవుతుంది. అక్కడి నుంచి దురై ప్రత్యర్థి సేతు( ఎస్.,జే సూర్య)తో తలపడాల్సి వస్తుంది. మరోవైపు ఓ పోలీస్ కమీషనర్ ఊరిని ‘క్లీన్’ చేయాలని ఎత్తులు వేస్తుంటాడు. రాయన్ బ్రదర్స్ తమ చెల్లి పెళ్లి చేయాలనుకున్న రోజు ముందు రాత్రి అనేక అనూహ్య సంఘటనలు జరుగుతాయి. వీటి వల్ల రాయన్ కుటుంబంలో విభేదాలు వస్తాయి. అవేంటీ..? దుడుకు తమ్ముడి వల్ల ఎదురైన సమస్యలు రాయన్ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాయి. అతని ఇద్దరు తమ్ముల్లు అతనికి తోడుగా ఉన్నారా.. ? సేతుతో రాయన్ కు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది మిగతా కథ.

ఎలా ఉంది..?

మాస్ ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో డైరెక్షన్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా కథంతా తన చుట్టూ తిరిగేలా ఉంటుందనుకుంటాం. కానీ ఇక్కడ ధనుష్ కథ చుట్టే తను తిరిగాడు. కథను దాటి ఎక్కడా తన ఇమేజ్ ను గ్లోరిఫై చేసుకోలేదు. అనేక లేయర్స్ గా సాగే ఇలాంటి కథను ఎంచుకోవడంలోనే ధనుష్ టాలెంట్ ఉంటే.. ఆ కథను అత్యంత సమర్థవంతంగా ఎమోషనల్ గా, ఎక్కడా డీవియేట్ కాకుండా రెండున్నర గంటల పాటు అద్భుతంగా చెప్పడం అతనికి మాత్రమే సాధ్యమైన ప్రతిభ. నిజంగా ఒక్కో ఫ్రేమ్, ఒక్కో షాట్, ఒక్కో సీన్ చూస్తుంటే ధనుష్ లో ఇంత గొప్ప టెక్నీషియన్ ఉన్నాడా అనిపించక మానదు. చిన్నప్పటి ఎపిసోడ్ నుంచి ఒక్కో లేయర్ ను రివీల్ చేస్తూ.. ఒక్కో క్యారెక్టర్ తో ముందుగా రాయన్ తగ్గి కనిపించడం .. తర్వాత తన తమ్ముళ్లకు ఏదైనా అవుతుందనిపిస్తే.. తల తీసేయడం వరకూ.. ఓ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అద్భుతంగా రాసుకున్నాడు. అలాగని ఇదేం కొత్త కథ కాదు. కానీ చాలా కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఒకే కుటుంబం కథ. ఆ కుటుంబంలోని సంఘర్షణను అత్యంత సమర్థవంతంగా కమర్షియల్ వాల్యూస్ తో చెప్పాడు. ఎక్కడా అతిశయోక్తులు( ఫైట్స్ మినహాయిస్తే ) ఉండవు. హీరో ఎప్పుడూ మొహం అదోలా పెట్టుకుని ఎందుకు ఉంటాడు అని ముత్తు రాయన్ లవర్ అడిగితే అందుకు అతని తమ్ముడు చెప్పిన కారణాలు చూస్తే.. అతను హృదయంలో ఎంతో వేదనను మోస్తూ అన్నేళ్లూ కష్టపడి తమ్ముళ్లు, చెల్లిని కంటికి రెప్పలా ఎలా కాపాడుకున్నాడో అర్థమై ప్రేక్షకుల మనసు చెమ్మగిల్లుతుంది. అదే సమయంలో తనూ ఓగ్యాంగ్స్ స్టర్ అయ్యే అవకాశం వస్తే అలాంటి జీవితం ఒద్దనుకుంటాడు. తమ్ముడు కాలేజ్ ఎలెక్షన్ కు వెళితే వద్దని వారిస్తూ.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు చెబుతాడు. చివరికి తనకూ, చెల్లికి జరిగిన అన్యాయంపై తిరగబడి హాస్పిటల్ పాలైతే.. తన ప్రాణాలు కాపాడే బాధ్యత ఆడపిల్ల అయిన చెల్లికి, శేఖర్ ఇచ్చి తనలోని హీరోను కప్పిపెట్టి దర్శకుడుగా శిఖరంలా కనిపిస్తాడు. ఇలాంటి ఆశ్చర్యాలు, ఈ కథలో అనేకం ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ప్రతి సీన్ మాస్టర్ పీస్ లా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్ట్స్ లెవల్.

సెకండ్ హాఫ్ కాస్త స్లోగా స్టార్ట్ అయినట్టు అనిపించినా.. తమ్ముళ్ల కథ మారిన తర్వాత మళ్లీ స్పీడందుకుంటుంది. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకూ ఆడియన్స్ కూడా కంప్లీట్ ఎమోషనల్ ఫీలవుతూ ఉంటారు. అతను గెలవాలి అన్న కసి చూసేవారిలోనూ కలుగుతుంది. ఒక గొప్ప కథనం ఉన్న సినిమాలకే ఇలా అనిపిస్తుంది. మొత్తంగా ధనుష్ లో ఓ గొప్ప దర్శకుడు కూడా ఉన్నాడని ఈ మూవీతో ప్రూవ్ అయింది.

నటన పరంగా :

ధనుష్ రాయన్ పాత్ర తనే రాసుకున్నా నటుడుగా ఆవాహన చేసుకున్నాడు ధనుష్. అతని కెరీర్ లోమరో బెస్ట్ యాక్టింగ్ ఇది. సందీప్ కిషన్ కు మాత్రమే ఒక డ్యూయొట్ ఉంది. అతను చాలా బాగా నటించాడు. కాళిదాస్ జయరాం, అపర్ణా బాలమురళి అదరగొడితే.. ధనుష్ తర్వాత ఈ మూవీలో అద్భుత నటనతో ఆకట్టుకునేది దుషారా విజయన్. అటుపై సెల్వ రాఘవన్ పాత్ర సినిమాకే హైలెట్. ఎస్జే సూర్య, దురై పాత్రలో శరవణన్ ఒదిగిపోయారు. చాలా రోజుల తర్వాత ప్రకాష్ రాజ్ కు చాలా తక్కువ డైలాగ్స్ తో కేవలం ఎక్స్ ప్రెషన్స్ తో అద్భుతమైన పాత్ర దక్కింది. సింపుల్ గా చెబితే ఈ సినిమాలో కాస్టింగ్ చాలా గొప్పగా కుదిరింది.

టెక్నికల్ గా :

రాయన్ కు రెండో హీరో ఏఆర్ రహమాన్. కొన్నాళ్లుగా ఆయన టచ్ పోయింది అనుకుంటున్నవాళ్లకు..సరైన కథ పడితే తనెంత గొప్ప సంగీతం అందిస్తాడో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అన్ డౌటెడ్ లీ.. అతనే సెకండ్ హీరో. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా కుదిరింది. ఒక్కో లేయర్ ను ఓపెన్ చేస్తున్నప్పుడు అద్భుతమైన ఎడిటింగ్ పనితనం కనిపిస్తుంది. కాస్టూమ్స్, తెలుగు వెర్షన్ డైలాగ్స్, లిరిక్స్, సెట్స్, ఆర్ట్ వర్క్ అన్నీ అదిరిపోయాయి.

ధనుష్ దర్శకుడుగా కంప్లీట్ కమాండ్ తో రూపొందించాడు ఈ మూవీని. ఇలాంటి కథను తెరకెక్కిస్తూ అంత ఇంటెన్సిటీతో కూడిన నటన చూపడం ఆషామాషీ విషయం కాదు. అందరికీ సాధ్యం అయ్యేదీ కాదు. ఈ విషయంలో ధనుష్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఆర్టిస్ట్స్

కథనం

సంగీతం

సినిమాటోగ్రఫీ

ఫైట్స్

దర్శకత్వం

మైనస్ పాయింట్స్ :

పాత కథ

సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల

సాంగ్స్

ఫైనల్ గా : పాత కథే.. చాలా కొత్తగా

రేటింగ్ : 3/5

- బాబురావు. కామళ్ల

Tags:    

Similar News