Jammu and Kashmir: యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి.. పది మంది మృతి
బస్సు లోయలో పడి దుర్మరణం;
జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఆదివారం రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బస్సు శివఖోడా ఆలయం నుంచి కత్రాకు తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.దాడి జరిగిన వెంటనే పోలీసులు, సైన్యం, పారామిలటరీ బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. అందులో ప్రమాణిస్తున్న ప్రయాణికుల్లో 10 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు.
యాత్రికులు శివఖోడి గుహ ఆలయానికి వెళ్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా బస్సుపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో బస్సు లోయలో పడి రాళ్లకు గట్టిగా ఢీకొనడంతో బస్సు తీవ్రంగా ధ్వంసమైంది. మృతదేహాలు ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటన స్థలి వద్ద అనేక ఖాళీ బుల్లెట్ కేసింగ్‌లు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకోగా, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రోడ్డు పక్కన నిలబడిన స్థానికులు సహాయక చర్యలలో సాయం చేస్తున్నట్లు సంఘటన స్థలం నుంచి దృశ్యాలు బయటకు వచ్చాయి. పోలీసులు, ఆర్మీ, పారామిలటరీ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను చికత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఈ ఘటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ దాడిని ఆయన ఖండించారు. ఉద్దేశపూర్వకంగా మన జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై బీజేపీ ప్రభుత్వానిది అసత్యప్రచారమే అని, ప్రస్తుతం మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బోలుగా ఉందని విమర్శించారు.