Fire Accident: కోల్‌కతా హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం

14 మంది మృతి.. పలువురికి గాయాలు;

Update: 2025-04-30 01:45 GMT

పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతాలోని ఓ హోటల్‌లో మంగళవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. చాలా మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కోల్‌కతా సీపీ మనోజ్‌ కుమార్‌ వర్మ మాట్లాడుతూ.. రాత్రి 8.15 గంటల ప్రాంతంలో రితురాజ్‌ హోటల్‌ ఆవరణలో మంటలు చెలరేగాయని సమాచారం అందిందని చెప్పారు. ఆ తర్వాత పలువురు భవనం కిటికీలు, ఇరుకైన గోడల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని.. నాలుగో అంతస్తు నుంచి పలువురు కిందకు దూకగా గాయపడ్డారని చెప్పారు. ప్రమాదంలో 14 మంది మృతదేహాలను వెలికి తీశామని.. చాలామందిని రక్షించినట్లు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణాలు తెలియవన్నారు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు సంభవించాయని అనుమానిస్తున్నట్లు చెప్పారు.

అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పది ఫైర్‌ ఇంజిన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, ఈ ప్రాంతం రద్దీగా ఉండడంతో ఫైర్‌ ఇంజిన్లు అక్కడికి చేరుకునేందుకు ఇబ్బందిపడ్డారు. అలాగే, మంటలను అదుపు చేసేందుకు ఫైర్‌ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. బుర్రాబజార్ తూర్పు భారతంలోనే అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్‌గా పేరుంది. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్, పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ప్రమాదంపై సంతాపం ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదకరమైన సంఘటనలు జరగకుండా అగ్నిమాపక భద్రతా చర్యలను క్షుణ్ణంగా సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభాంకర్ సర్కార్ ఈ సంఘటనపై స్పందించారు. కోల్‌కతా కార్పొరేషన్‌పై మండిపడ్డారు. విచారకరమైన సంఘటన అని.. చాలా మంది ఇప్పటికీ భవనంలో చిక్కుకున్నారని.. కనీస భద్రత లేదని.. కార్పొరేషన్ ఏమి చేస్తుందో నాకు తెలియదంటూ మండిపడ్డారు.

Tags:    

Similar News