Bangladeshi Nationals : భారత్ లోకి అక్రమంగా బంగ్లాదేశీయులు.. 18 మంది అరెస్ట్
బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి వచ్చేందుకు అక్కడి పౌరులు సరిహద్దుకు చేరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడుతున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. త్రిపురలో మూడు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన బలగాలు.. 18 మందిని అరెస్టు చేశాయి. వీరికి సహకరించిన ఐదుగురు భారతీయులను కూడా అరెస్టు చేసినట్లు త్రిపుర పోలీసులు వెల్లడించారు.త్రిపురలోని గోమతి జిల్లాలో పలువురు బంగ్లాదేశీయులు ఉన్నారని సమాచారం పోలీసులకు అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. శనివారం ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆదివారం నిర్వహించిన దాడుల్లో మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరికి సహకరించిన ఐదుగురు భారతీయులను కూడా అరెస్టు చేశారు. మరో ఆపరేషన్‌లో ఎంబీబీ విమానాశ్రయం నుంచి ముగ్గురు బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 18 మంది పొరుగుదేశీయులను అరెస్టు చేసినట్లు త్రిపుర్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అనంత దాస్ వెల్లడించారు.