Puri Rath Yatra: రథయాత్రలో తొక్కిసలాట.. గుడించా గుడి వద్ద ఘటన.. ముగ్గురి మృతి

ఘటనపై 30రోజుల్లోనే దర్యాప్తును పూర్తి చేస్తాం : ఒడిశా మంత్రి;

Update: 2025-06-30 00:45 GMT

పూరీ రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పరిపాలనా దర్యాప్తును 30 రోజుల్లోపు పూర్తి చేస్తామని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. అభివృద్ధి కమిషనర్‌ (డీసీ) అనుగార్గ్‌ నేతృత్వంలోని కమిటీ దర్యాపు చేసి 30 రోజుల్లో ముఖ్యమంత్రికి నివేదికను మసర్పిస్తుందని ఒడిశా న్యాయమంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు. ఈ విషాద ఘటనకు కారణమైన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

గుండీచాదేవీ ఆలయం వద్ద ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందటంతో పాటు పలువురు గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆదివారం రాత్రి 8 గంటలకు క్షతగాత్రులను డిశ్చార్జ్‌ చేసినట్లు పూరీ జిల్లా ప్రధాన వైద్యాధికారి తెలిపారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిర్ధరించిన తర్వాతే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ చేసినట్లు చెప్పారు.

సీఎం నివాసం ముట్టడికి యత్నం

ఇదిలా ఉండగా, ఆదివారం ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి, న్యాయశాఖ మంత్రి హరిచందన్ రాజీనామా చేయాలని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. సీఎం నివాసాన్ని ముట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించగా, ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చకచక బాధ్యతల స్వీకరణ

ఇక భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న డీసీపీ బిష్ణుపతి, కమాండెంట్‌ అజయ్‌పాఢిలను సస్పెండ్ చేయగా, పూరీ కలెక్టరు సిద్ధార్ధ్‌ శంకర్‌ స్వయిన్, ఎస్పీ వినీత్‌ అగర్వాల్‌కు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్ధార్ధ్‌ శంకర్​ను సాధారణ పాలనా విభాగం (జీఏ) ఓఎస్‌డీగా నియమించారు. ఖుర్దా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చంచల్‌రణను పూరీ కలెక్టర్‌గా నియమించారు. ఎస్టీఎఫ్‌ డీఐజీగా విధులు నిర్వహిస్తున్న పినాక మిశ్రను పూరీ ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అగర్వాల్‌కు మూడు రథాల పర్యవేక్షకునిగా నియమించారు. శాంతిభద్రతల ఏడీజీగా విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్‌ సీనియర్‌ అధికారి సౌమ్యేంద్ర ప్రియదర్శికి పూరీ రథయాత్రలో పోలీసుల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తూ హోంశాఖ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. పూరీ వేడుకలు ముగిసే వరకు ఆయన అక్కడే ఉండి విధులు నిర్వహిస్తున్న అధికారులు, పోలీసులకు సూచనలిస్తారు.

Tags:    

Similar News