North India Floods: భారీ వర్షాలకు గడగడలాడుతున్న ఉత్తర భారతం.. 31 మంది మృతి..

North India Floods: భారీ వర్షాలకు ఉత్తర భారతం గడగడలాడుతోంది. మూడురోజులుగా నాన్‌ స్టాప్‌గా వర్షాలు దంచికొడుతున్నాయి.

Update: 2022-08-21 11:30 GMT

North India Floods: భారీ వర్షాలకు ఉత్తర భారతం గడగడలాడుతోంది. మూడురోజులుగా నాన్‌ స్టాప్‌గా వర్షాలు దంచికొడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో మెరుపు వరదలు పలు ప్రాంతాలను అల్లకల్లోలం చేశాయి. ఇటు ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ వర్షాలతో జనజీవనం స్తంభించింది. వరదల బీభత్సానికి నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 31 మంది ప్రాణాలు విడిచారు. ఇందులో ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు లెక్కలేనంతా ఆస్థినష్టం జరిగింది.

హిమాచల్ ప్రదేశ్‌ను వానలు వణికిస్తున్నాయి. క్షణం గ్యాప్ ఇవ్వకుండా వాన దంచికొడుతోంది. పలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అయ్యింది. కంగ్రా, కులు, మండి, ధర్మశాల జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ధర్మశాలలో వర్షాలు, ఈదురుగాలులకు కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో నదులన్నీ ఉగ్రరూపం దాల్చుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రంగంలోకి దిగిన అధికారులు లోతట్టు ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు.

కంగ్రా జిల్లాలో వరద ధాటికి రైల్వే వంతెన కుప్ప కూలింది. దీంతో పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్‌మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు చక్కీ నదిపై నిర్మించిన వంతెనలోని ఓ పిల్లర్ ధ్వంసమైంది. వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గుతోంది. మండి జిల్లాలో వరదల కారణంగా జనజీవనం స్తంభించింది. ఇళ్లు, దుకాణాలు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు చంబా జిల్లాలో వర్షం బీభత్సానికి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇల్లు కూలి ముగ్గురు వ్యక్తులు మరణించారు.

మరోవైపు ఉత్తరాఖండ్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. డెహ్రాడూన్​ జిల్లాలోని రాయ్​పూర్​- కుమల్డా ప్రాంతంలో ఎటుచూసినా వరద నీరే కనిపిస్తోంది. అనేక గ్రామాలు జలమయమయ్యాయి.ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. నదులు ఉద్ధృతంగా పొంగి పొర్లుతున్నాయి. సాంగ్​నదిపై ఉన్న బ్రిడ్జ్​ ఒకటి.. కొట్టుకుపోయింది. జమ్ముకశ్మీర్​ వర్షాల ధాటికి.. ఉధమ్‌పూర్​ జిల్లాలోని సమోలి గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనతో ఓ ఇల్లు కుప్పకూలింది. ఈ ప్రమాదం ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు.

Tags:    

Similar News