Toxic Liquor: తమిళనాడులో 55కి చేరిన మృతుల సంఖ్య..
కళ్లకురిచిలో మృత్యుఘోష..;
తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా మరో 15 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 55కు చేరింది. ప్రస్తుతం ఇంకా 120 మందికి పైనే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వీళ్లలోనూ 30 మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. కల్తీసారా ప్రభావంతో కొందరికి కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలమవుతుండటంతో నిపుణులైన వైద్యులను అధికారులు రంగంలోకి దింపి చికిత్స అందిస్తున్నారు
ఇక, కల్తీ సారా ఘటన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీసీఐడీకి అప్పజెప్పింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించింది. కాగా, సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ కేసు విచారణను సీబీసీఐడీతో కాకుండా సీబీఐతో జరిపించాలని తమిళనాడు ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం డిమాండ్ చేస్తున్నారు.
కాగా, మరోవైపు.. కళ్లకురిచ్చి ఉదంతంపై శుక్రవారం అసెంబ్లీలో విపక్ష ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి 55 మంది వరకు మృతి చెందడంపై సభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ విపక్ష ఏఐడీఎంకే పార్టీ సభ్యులను స్పీకర్ అప్పావు మార్షల్స్‌తో బయటకు పంపించి వేశారు.