8th Pay Commission : 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్..మీ జీతం పెరగాలంటే వెంటనే ఇలా చేయండి.

Update: 2026-03-10 07:45 GMT

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం ప్రక్రియ ఇప్పుడు వేగం పుంజుకుంది. నవంబర్ 3, 2025న ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, తాజాగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు, సామాన్య ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానిస్తూ అధికారిక నోటీసు విడుదల చేసింది. దీనివల్ల రాబోయే రోజుల్లో లక్షలాది మంది ఉద్యోగుల జీతభత్యాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌లోనే అన్నీ.. ఏప్రిల్ 30 ఆఖరి తేదీ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, పెన్షన్ల నిర్మాణాన్ని సమీక్షించడమే ఈ కమిషన్ ప్రధాన ఉద్దేశ్యం. తమ డిమాండ్లు లేదా ప్రతిపాదనలను పంపాలనుకునే వారు కేవలం ఆన్‌లైన్ ద్వారానే సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ ఫామ్ అందుబాటులోకి తెచ్చారు. దీన్ని అటు పే కమిషన్ వెబ్‌సైట్‌లో లేదా MyGov పోర్టల్‌లో పూర్తి చేయవచ్చు. పోస్ట్ ద్వారా పంపే లెటర్లు, ఈమెయిల్స్ లేదా పీడీఎఫ్ ఫైళ్లను కమిషన్ అస్సలు పరిగణనలోకి తీసుకోదు. ఈ సూచనలు పంపడానికి ఏప్రిల్ 30, 2026 వరకు సమయం ఇచ్చారు.

66 శాతం వరకు పెరగనున్న బేసిక్ శాలరీ?

ఉద్యోగ సంఘాల డిమాండ్లను గనుక ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఉద్యోగుల బేసిక్ శాలరీ ఏకంగా 66 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే కేవలం జీతం పెరగడమే కాకుండా, కనీస వేతనాన్ని నిర్ణయించే పాత పద్ధతి కూడా మారబోతోంది. ధరల పెరుగుదల, ప్రస్తుత జీవన ప్రమాణాలకు అనుగుణంగా జీతాలు ఉండాలని యూనియన్లు పట్టుబడుతున్నాయి.

1956 నాటి ఫార్ములాకు చెక్

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను 1956లో రూపొందించిన పాత ఫార్ములా ఆధారంగానే నిర్ణయిస్తున్నారు. దీని ప్రకారం ఒక ఉద్యోగి కుటుంబంలో ముగ్గురు సభ్యులు (భార్య, భర్త, ఒక బిడ్డ) మాత్రమే ఉంటారని లెక్కగట్టేవారు. కానీ నేటి కాలంలో కుటుంబ బాధ్యతలు పెరిగాయని, తల్లిదండ్రులతో పాటు కనీసం ఇద్దరు పిల్లలను పరిగణనలోకి తీసుకుని కుటుంబ సభ్యుల సంఖ్యను ఐదుగా లెక్కించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా పాత ముగ్గురు సభ్యుల మోడల్ ఏమాత్రం సరిపోదని వారు వాదిస్తున్నారు.

Tags:    

Similar News