PM Kisan : రైతన్నలకు అలర్ట్.. పీఎం కిసాన్ 22వ విడత నిధులు వచ్చేది అప్పుడే.
PM Kisan : దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ 22వ విడత నిధుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. హోలీ పండుగ కంటే ముందే ఖాతాల్లో రూ.2,000 జమ అవుతాయని అందరూ భావించినప్పటికీ, ఇప్పటివరకు ఆ డబ్బులు అందలేదు. దీంతో అన్నదాతల్లో గందరగోళం నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ విడత నిధుల విడుదలకు సంబంధించి ఈ వారంలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మార్చి 13న ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో ఉన్నప్పుడు దీనిపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
పీఎం కిసాన్ పథకం అంటే ఏమిటి?
చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2019లో ప్రారంభించింది. దీని కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేస్తారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, పైసా కూడా తగ్గకుండా నేరుగా లబ్ధిదారులకు అందడం ఈ పథకం ప్రత్యేకత.
డబ్బులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి?
సాధారణంగా పీఎం కిసాన్ నిధులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదలవుతాయి. 21వ విడత నిధులు 2025 చివరలో అందాయి కాబట్టి, 22వ విడత ఫిబ్రవరి 2026లో రావాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి గడిచిపోయింది, హోలీ కూడా అయిపోయింది. దీంతో కేంద్రం త్వరలోనే జరిగే ఒక బహిరంగ సభ ద్వారా ఈ నిధులను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. మార్చి 13వ తేదీన రైతులకు తీపి కబురు అందే అవకాశం మెండుగా ఉంది.
ఈ తప్పులు చేస్తే నిధులు నిలిచిపోతాయి
* మీ పేరు రిజిస్టర్ అయి ఉన్నా.. కొన్ని పొరపాట్లు ఉంటే మాత్రం ఈసారి రూ. 2,000 మీ ఖాతాలోకి రావు.
* e-KYC: ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ పూర్తి చేయకపోతే డబ్బులు రావు.
* భూ రికార్డులు: మీ పేరు మీద ఉన్న భూమి రికార్డులు పోర్టల్‌లో వెరిఫై అవ్వాలి.
* ప్రభుత్వ ఉద్యోగం: కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా ఈ పథకం వర్తించదు.
* పెన్షన్: నెలకు రూ.10,000 కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వారు కూడా అనర్హులే.
రైతులు చేయాల్సిన పనులు
మీకు డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవడానికి పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి బెనిఫిషియరీ లిస్ట్ చెక్ చేసుకోవాలి. మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు ఎంటర్ చేస్తే లిస్ట్ కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉండి, స్టేటస్ అన్నీ వెరిఫై అయి ఉంటే నిధులు విడుదలైన వెంటనే మీ అకౌంట్‌లో పడతాయి. ఏవైనా సమస్యలు ఉంటే వెబ్‌సైట్‌లోని కిసాన్ ఈ-మిత్ర చాట్‌బాట్ సాయం తీసుకోవచ్చు.