వైమానిక దళం కోసం 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలుకు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ -H.A.Lతో... కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 97 యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ-C.C.S ఆమోదించిన నెల రోజుల తర్వాత H.A.Lతో రక్షణశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. 2021లో 48 వేల కోట్ల రూపాయల విలువైన 83 తేజస్ M.K.1.A యుద్ధ విమానాల కొనుగోలుకు.... H.A.Lతో రక్షణశాఖ ఒప్పందం చేసుకుంది. తాజాగా చేసుకున్న ఒప్పందం రెండోది. 97 తేజస్-M.K.1.Aలను 62 వేల 370 కోట్లతో రక్షణశాఖ కొనుగోలు చేయనుంది. ఈ యుద్ధ విమానాల్లో ఆధునిక ఫీచర్లైన స్వయం రక్షా కవచ్, నియంత్రణ వ్యవస్థలు సహా 64 శాతం దేశీయంగా తయారైనవే ఉంటాయని రక్షణశాఖ తెలిపింది. భారత్ లో తయారైన 67 వస్తువులను తేజస్ లో ఉపయోగిస్తున్నట్లు వివరించింది. 2027-28 నుంచి నూతన యుద్ధవిమానాలను క్రమంగా వైమానికదళానికి H.A.L అందించనుంది. మిగ్-21 యుద్ధ విమానాల స్థానాన్ని..ఇవి భర్తీ చేయనున్నాయి. వైమానిక దళానికి 42 స్క్వాడ్రన్లను అధికారికంగా కేటాయించగా..... యుద్ధ విమానాల కొరతతో 31 స్వ్కాడ్రన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. అతి ప్రమాదకర గగనతల వాతావరణంలోనూ పోరాడే సామర్థ్యం తేజస్ పోరాట విమానాలకు ఉంది.