ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ వద్ద రైతు భరోసా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కార్యాలయంలోని డోర్లు, గోడలకు తెలంగాణలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ పాలన అంటూ పోస్టర్లు అంటించారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరుమీద రైతులకు ఎకరాకి 15వేల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకుంటూ ఎకరాకు 15వేలు ఇవ్వమని, 12వేలు రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. దీనిపై ఏకంగా ఏఐసీసీ కాంగ్రెస్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ పేరుతో పోస్టర్లు అంటించడం సంచలనంగా మారింది.