Road Accident : జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది శివభక్తులు స్పాట్

Update: 2025-07-29 09:15 GMT

జార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్గఢ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది కన్వారియాలు (శివ భక్తులు) మరణించారు. మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతం సమీపంలో కన్వారియాలతో వెళ్తున్న బస్సు, గ్యాస్ సిలిండర్ల లోడుతో ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.శ్రావణమాసం కావడంతో పలువురు భక్తులు కన్వర్ యాత్రకుల బస్సులో బయలుదేరగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రాథమికంగా, బస్సు డ్రైవర్ నిద్రపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. "జార్ఖండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా విషాదకరం. అందులో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ బాధను భరించే శక్తిని దేవుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. దీనితో పాటు, గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు మరియు వైద్య సహాయాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News