AAP MLA Arrest : మనీలాండరింగ్ కేసు.. ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా అరెస్ట్

Update: 2024-09-03 06:30 GMT

ఆప్‌ నేత, ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోమవారం అరెస్టు చేసింది. ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు చేపట్టింది. ఢిల్లీ వక్ఫ్‌బోర్డ్‌లో నియామకాలు, ఆ సంస్థకు చెందిన రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తుల లీజుకు సంబంధించిన అవకతవకల్లో అమానతుల్లా హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన ఇంట్లో తనిఖీలు ప్రారంభమైన సమయంలో అమానతుల్లా ఖాన్‌ ఒక వీడియో స్టేట్‌మెంట్‌ను ‘ఎక్స్‌’లో విడుదల చేశారు. తనిఖీల పేరిట వచ్చి తనను అరెస్టు చేయడానికి ఈడీ ప్లాన్‌ చేస్తోందని దీనిలో ఆరోపించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అత్తగారు ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఈడీకి వెల్లడించినట్లు తెలిపారు. దాదాపు రెండేళ్లుగా తప్పుడు కేసులు బనాయించి ఆ దర్యాప్తు సంస్థ తనను వేధిస్తున్నట్లు చెప్పారు. కేవలం తానే కాదని.. తన పార్టీ మొత్తాన్ని ఈడీ వెంటాడుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమనతుల్లా పోస్టు చేసిన వీడియోలో ఈడీ అధికారులతో మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నాయి. అమానతుల్లా ఖాన్‌ ఇంట్లో తనిఖీలపై ఆప్‌ కీలక నేత సంజయ్‌ సింగ్‌ స్పందించారు. దురుద్దేశాలతోనే ఈడీ ఆయనపై దర్యాప్తు చేపట్టిందని ఆరోపించారు. సుప్రీం కోర్టు పలుమార్లు మందలించినా ఈడీ ఈ చర్యలను ఆపడంలేదని పేర్కొన్నారు. కేవలం ప్రతిపక్షాలను జైలులో పెట్టడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.

Tags:    

Similar News