ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి అతిపెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయన్ను 3182 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం ఇందుకు కారణాలు. ఇక ఆ పార్టీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఓడిపోయారు. జంగ్‌పుర నుంచి పోటీ చేసిన ఆయనపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి స్వల్ప ఊరట. ఢిల్లీ సీఎం ఆతిశీ మార్లేనా 3521 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కల్కాజీ నుంచి పోటీ చేసిన ఆమె సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత రమేశ్ బిధూరీని ఓడించారు. 9 రౌండ్లు ముగిసే సరికి 252 ఓట్ల వెనుకంజలో ఉన్న ఆమె పదో రౌండులో 989 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఆఖరిదైన 12వ రౌండ్ ముగిసే సరికి 3521 ఓట్ల ఆధిక్యం అం దుకున్నారు. కేజ్రీ, సిసోడియా ఓడినా ఆతిశీ గెలవడం గమనార్హం.