IMD : మేలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు

సాధారణం కంటే ఎక్కువ రోజులపాటు వడగాలులు;

Update: 2025-05-01 04:30 GMT

మే నెలలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మేలో సాధారణంగా నాలుగు రోజులపాటు వీచే వడగాలులు ఈసారి వారం పాటు ఉంటాయని పేర్కొంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి ఉంటాయని వెల్లడించింది. అయితే, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే గత ఏడాది లాంటి తీవ్ర వేడి పరిస్థితుల నుంచి తప్పించుకోవచ్చని పేర్కొంది.

మే నెలలో వడగాలులు నాలుగు రోజులు అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ముఖ్యంగా రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని గంగానది పరీవాహక ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు. అలాగే, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణకు ఆనుకుని ఉన్న ప్రాంతాలు, ఉత్తర కర్ణాటక రాష్ట్రాలు కూడా సాధారణం కంటే ఎక్కువ రోజులపాటు వడగాలులను ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. సాధారణంగా మే నెలలో దేశంలోని దక్షిణ, పడమర తీర ప్రాంతాలను మినహాయించి మిగతా ప్రాంతాల్లో ఒకటి నుంచి మూడు రోజుల వరకే వడగాలులు నమోదవుతుంటాయి.

ఈసారి అధిక వర్షపాతం

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈసారి సాధారణ నుంచి అధిక వర్షపాతం నమోదవుతుందని, అయితే ఉత్తర, మధ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇది తక్కువగా ఉండొచ్చని ఐఎండీ తెలిపింది. వడగాలుల నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, గుండె, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగించవచ్చు. ఉష్ణతాపం వల్ల నీరసించిపోవడంతోపాటు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.

Tags:    

Similar News