Acharya Devvrat: మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్

రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా ప్రమాణం చేసిన దేవవ్రత్

Update: 2025-09-15 06:15 GMT

మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో దేవవ్రత్ గవర్నర్‌గా ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. గుజరాత్ గవర్నర్‌గా ఉన్న దేవవ్రత్.. మహారాష్ట్ర అదనపు బాధ్యతలను రాష్ట్రపతి అప్పగించారు. దీంతో సోమవారం ఆయన గవర్నర్‌గా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే, మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

ఆచార్య దేవవ్రత్..

ఆచార్య దేవవ్రత్ 1959, జనవరి 18న జన్మించారు. భారతదేశ విద్యావేత్త. 2019 జూలై 22 నుంచి గుజరాత్ గవర్నర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2015 ఆగస్టు 12 నుంచి 2019 జులై 21 వరకు హిమాచల్‌ప్రదేశ్ 18వ గవర్నర్‌గా కూడా పని చేశారు. ఆర్య సమాజ్ ప్రచారక్‌గా కూడా పని చేశారు. అంతకముందు హర్యానాలోని కురుక్షేత్రలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇక గుజరాత్‌లోని పలు విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా కూడా పని చేశారు.

మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ.రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోయారు. దీంతో మహారాష్ట్ర గవర్నర్ స్థానం ఖాళీ అయింది. అయితే ప్రస్తుతానికి గుజరాత్ గవర్నర్‌గా ఉన్న దేవవ్రత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఆచార్య దేవవ్రత్.. తన భార్య దర్శనా దేవితో కలిసి ఆదివారం ఉదయం అహ్మదాబాద్ నుంచి తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబై చేరుకున్నారు. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆయనకు ఘన స్వాగతం పలికారు.


Tags:    

Similar News