Darshan: కూలింగ్ గ్లాసెస్.. బ్రాండెట్ టీ షర్ట్..బళ్లారి జైల్లోకి దర్శన్‌ గ్రాండ్ ఎంట్రీ.

పోలీసులపై చర్యలు;

Update: 2024-08-30 06:15 GMT

అభిమాని రేణుక స్వామి  హత్య కేసులో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీప  ప్రవర్తన అధికారులకు తలనొప్పిగా మారింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు  విచారణ ఖైదీగా ఉన్న నటుడికి రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఇటీవలే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతడిని గురువారం బళ్లారిలోని జైలుకు   అధికారులు తరలించారు. అయినప్పటికీ అతడి తీరు మారలేదు.

కూలింగ్ గ్లాసెస్.. బ్రాండెడ్ టీ షర్ట్.. చేతికి బ్రాస్ లెట్.. ఇది బళ్లారి జైలుకు తరలించేటప్పుడు హీరో దర్శన్ కనిపించిన తీరు. సుమారు రెండు నెలలుగా జైలులో ఉన్నా దర్శన్ లగ్జరీ లైఫ్ ఏ మాత్రం మారలేదని దీనిని చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో ఈ హీరోకు రాచ మర్యాదలు అందుతున్నాయని తేలడంతో ప్రభుత్వం అతనిని బళ్లారి జైలుకు తరలించింది. అయితే ఇక్కడ కూడా హీరో దర్శన్ విషయంలో జైలు సెక్యూరిటీ గార్డులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలింది. భద్రతా సిబ్బంది దర్శన్ ను కూలింగ్ గ్లాసెస్ ధరించడానికి అనుమతించారు. అలాగే నటుడి చేతికి  బ్రాస్ లెట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీపీని డీఐజీ టి.పి. శేషయ్య ఆదేశాలు జారీ చేశారు.

అయితే, ఈ ఘటనపై పోలీసు అధికారులు మరో విధంగా చెబుతున్నారు. దర్శన్‌ నెక్‌కు తగిలించుకున్నవి సన్‌గ్లాసెస్‌ కావని, పవర్‌ గ్లాసెస్‌ అని అంటున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న అండర్‌ ట్రయల్‌ ఖైదీలు, నిందితులు వాటిని పెట్టుకునేందుకు అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. అది నేరం కాదని వివరణ ఇచ్చారు.

కాగా, అభిమాని రేణుక స్వామి హత్య కేసులో దర్శన్‌ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో విచారణ ఖైదీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయనతోపాటు మరికొందరు నిందితులు జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. అయితే, జైల్లో విచారణ ఖైదీగా ఉన్న నటుడికి రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఇటీవలే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.

ఇటీవలే దర్శన్‌ జైలులోని రౌడీషీటర్లతో జల్సాగా టీ తాగుతూ, సిగరెట్‌ కాల్చుతూ ఆనందంగా గడుపుతున్నట్లు ఓ ఫొటో బయటపడింది. అంతేకాకుండా ఆయన జైలు నుంచి వీడియో కాల్‌ మాట్లాడుతున్నట్లు ఓ వీడియో కూడా వైరల్‌ అయింది. వీటిపై దర్యాప్తు జరిపిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ జైలు చీఫ్‌ సూపరింటెండెంట్‌తోపాటు తొమ్మిది మందిని సస్పెండ్‌ చేశారు. అదేవిధంగా దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించాలని 24వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు భారీ భద్రత మధ్య గురువారం ఉదయం దర్శన్‌ను పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించారు. మిగతా నిందితులను సైతం కర్ణాటకలోని ఇతర జైళ్లకు తరలించినట్లు తెలిసింది.

Tags:    

Similar News