Indian Economy : అగ్రరాజ్యాలకే షాకిస్తున్న ఇండియా వృద్ధి.. ఏడీబీ నివేదికతో దద్దరిల్లుతున్న గ్లోబల్ మార్కెట్లు.

Update: 2026-04-10 09:45 GMT

Indian Economy : భారత ఆర్థిక వ్యవస్థ దూకుడుపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గత వారం అమెరికా రేటింగ్ ఏజెన్సీలు ఇండియా వృద్ధి రేటుపై ధీమా వ్యక్తం చేయగా, తాజాగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) కూడా భారత్ జైత్రయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026-27)లో భారత్ 6.9 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఏడీబీ అంచనా వేసింది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) విడుదల చేసిన తాజా ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం.. భారత్ ఎదుగుదలకు దేశీయంగా ఉన్న భారీ డిమాండ్ ప్రధాన కారణం. దీనికి తోడు అమెరికా భారత వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించడం మన ఎగుమతులకు వరంగా మారింది. ఆదాయపు పన్ను, జీఎస్టీలో చేసిన మార్పులు, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వంటివి భారత ఆర్థిక ఇంజిన్‌కు ఇంధనంలా మారాయని ఏడీబీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో నమోదైన 7.6 శాతం వృద్ధి కంటే, రాబోయే రోజుల్లో భారత్ మరింత స్థిరంగా ముందుకు సాగుతుందని నివేదిక వెల్లడించింది.

2027-28 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి భారత్ వృద్ధి రేటు ఏకంగా 7.3 శాతానికి చేరుతుందని ఏడీబీ అంచనా వేసింది. యూరోపియన్ యూనియన్ తో జరగబోయే వాణిజ్య ఒప్పందాలు, దేశీయంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు దీనికి ప్రధాన ఊతమివ్వనున్నాయి. గతంలో 2026-27 సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఏడీబీ, ఇప్పుడు దానిని 6.9 శాతానికి పెంచడం విశేషం. అంటే భారత ఎకానమీ అంచనాల కంటే వేగంగా పుంజుకుంటోందని అర్థమవుతోంది.

అయితే, ప్రతికూల అంశాలు కూడా లేకపోలేదు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగితే భారత్‌పై ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల పెరుగుదల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతానికి చేరవచ్చని ఏడీబీ హెచ్చరించింది. ఆహార పదార్థాల ధరల్లో హెచ్చుతగ్గులు కూడా సామాన్యుల వినియోగంపై కొంత ఒత్తిడిని కలిగించవచ్చు.

యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకోబోయే వాణిజ్య ఒప్పందాల వల్ల భారత ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని ఏడీబీ భావిస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల పెరుగుదల వల్ల మార్కెట్లో నగదు చలామణి పెరిగి, దేశీయ డిమాండ్‌ను మరింత బలోపేతం చేస్తుందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, భారత్ తనదైన శైలిలో వృద్ధిని కొనసాగించడం పట్ల ఆర్థిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News