RBI New Rules : ఇక నో వెయిటింగ్.. విదేశాల నుంచి వచ్చే డబ్బులు సేమ్ డేనే మీ అకౌంట్లోకి.. ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.

Update: 2026-04-10 09:30 GMT

RBI New Rules : విదేశాల్లో ఉన్న మీ బంధువులు లేదా స్నేహితులు డబ్బులు పంపిస్తే, అవి మీ చేతికి అందడానికి రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఇకపై ఉండదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ సామాన్యులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. విదేశీ లావాదేవీల విషయంలో బ్యాంకుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేస్తూ, కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీనివల్ల విదేశీ డబ్బులు పంపిన రోజే మీ అకౌంట్‌లో జమ కానున్నాయి.

కొత్త నిబంధన ఏమిటి?

సాధారణంగా విదేశాల నుంచి ఎవరైనా డబ్బులు పంపిస్తే, అవి మన బ్యాంకు ఖాతాలో జమ కావడానికి ప్రస్తుతం ఒకటి రెండు రోజులు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది. దీనివల్ల అత్యవసర అవసరాలు ఉన్నవారు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తూ ఆర్‌బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం.. విదేశీ మారక ద్రవ్య మార్కెట్ పనివేళల్లో బ్యాంకుకు డబ్బు అందినట్లయితే, అదే రోజు ఆ సొమ్మును కస్టమర్ ఖాతాలో జమ చేయాలి. ఒకవేళ మార్కెట్ పనివేళలు ముగిసిన తర్వాత డబ్బు వస్తే, మరుసటి పనిదినం మొదలవ్వగానే అకౌంట్లోకి పంపాలి.

కస్టమర్లకు అలర్ట్ పక్కా

డబ్బు జమ చేయడమే కాదు, విదేశాల నుంచి మీకు డబ్బు వచ్చినట్లు సమాచారం అందిన వెంటనే బ్యాంకులు కస్టమర్లకు ఆ విషయాన్ని తెలియజేయాలి. ఒకవేళ బ్యాంకు పనివేళల తర్వాత ఆ సమాచారం వస్తే, మరుసటి రోజు ఉదయాన్నే కస్టమర్‌కు మెసేజ్ లేదా మెయిల్ ద్వారా అప్‌డేట్ ఇవ్వాలి. దీనివల్ల తమ డబ్బు ఎక్కడుంది? ఎప్పుడు జమ అవుతుంది? అనే విషయంలో కస్టమర్లకు క్లారిటీ ఉంటుంది. అలాగే, ప్రస్తుతం బ్యాంకులు రోజు చివరన లెక్కలు చూసుకునే పద్ధతికి బదులుగా, ప్రతి గంటకు ఒకసారి లేదా రియల్ టైమ్‌లో వివరాలను అప్‌డేట్ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

టెక్నాలజీతో వేగం

బ్యాంకులు తమ డిజిటల్ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. కస్టమర్లు తమ లావాదేవీలను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకునేందుకు, అవసరమైన పత్రాలను డిజిటల్ పద్ధతిలో సమర్పించేందుకు ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా, స్ట్రెయిట్ త్రూ ప్రాసెసింగ్ (STP) వంటి ఆటోమేటెడ్ వ్యవస్థలను వాడటం వల్ల మానవ ప్రమేయం లేకుండానే డబ్బులు నేరుగా ఖాతాలోకి చేరతాయి. దీనివల్ల పొరపాట్లు జరగవు. సమయం ఆదా అవుతుంది.

ఎప్పటి నుంచి అమలు?

బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్, పనితీరును కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవడానికి ఆర్‌బీఐ ఆరు నెలల సమయం ఇచ్చింది. అంటే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 కింద ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విదేశాల నుంచి డబ్బు పొందే లక్షలాది మంది సామాన్యులకు, ముఖ్యంగా ప్రవాస భారతీయుల (NRI) కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.

Tags:    

Similar News