దేశంలోని గ్రామీణ ప్రాంత యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'ఏఐ ఫర్ ఇండియా 2.0' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2023 జూలై 15న 'ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) కోర్సులలో యువతకు ఉచితంగా ఆన్‌లైన్ శిక్షణ అందిస్తున్నారు.
ఈ కార్యక్రమం ముఖ్యంగా గ్రామీణ ఆంగ్లేతర నేపథ్యాల నుంచి వచ్చిన కళాశాల విద్యార్థులు, పట్టభద్రులు, యువ వృత్తి నిపుణులను లక్ష్యంగా చేసుకుంది. హిందీ, తెలుగు, కన్నడ సహా మొత్తం తొమ్మిది భారతీయ భాషలలో శిక్షణా కంటెంట్‌ను అందుబాటులో ఉంచడం దీని ప్రత్యేకత. దీనివల్ల భాషాపరమైన అడ్డంకులు తొలగిపోయి ఎంతోమంది యువతకు సాంకేతిక విద్య చేరువవుతోంది.
ఈ ఆన్‌లైన్ వేదిక ద్వారా నిపుణులు రూపొందించిన పైథాన్ కోర్సులతో పాటు ఏఐ, ఎంఎల్‌పై సమగ్ర శిక్షణ లభిస్తుంది. విజయవంతంగా కోర్సులు పూర్తి చేసిన వారికి జాతీయ స్థాయి గుర్తింపు (అక్రెడిటేషన్) కూడా లభిస్తుంది.
నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమం గ్రామీణ యువతలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి వారిని సాధికారత దిశగా నడిపించడానికి ఒక ముఖ్యమైన మార్గమని ప్రభుత్వం భావిస్తోంది.