Aviation Industry: దేశంలో విమానయాన రంగంలో భారీ కుదుపులు
17 ఏండ్లలో 5 కనుమరుగు;
దేశంలో విమానయాన రంగం కుదుపులకు లోనవుతున్నది. ఏకైక ఫుల్ సర్వీస్ క్యారియర్ (ఎఫ్‌ఎస్‌సీ)గా ఎయిరిండియా మాత్రమే మిగిలింది. 2007లో ఐదు ఎఫ్‌ఎస్‌సీలు ఉండేవి. విలీనాలు, వైఫల్యాల వల్ల వీటి సంఖ్య ప్రస్తుతం ఒకటికి చేరింది. ఫుల్ సర్వీస్ క్యారియర్స్ ప్రయాణికులకు కల్పించే అదనపు సదుపాయాలకు ఛార్జీలను టికెట్ ధరలోనే కలుపుతాయి. అదే లో-కాస్ట్ క్యారియర్స్ టికెట్ ధరను తక్కువగా చూపించి, అదనపు సదుపాయాలకు అదనంగా వసూలు చేస్తాయి. విస్తారా ఎయిర్‌లైన్స్ సోమవారం ఎయిరిండియాలో విలీనమైంది. దీంతో ఎయిరిండియా మాత్రమే మన దేశంలో ఎఫ్‌ఎస్‌సీగా మిగిలింది.
టాటా గ్రూప్ 2022లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. అక్కడి నుంచి తన నిర్వహణలోని ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్ ఇండియాలో విలీనం చేస్తోంది. ఈ విలీనంతో ఎయిర్ ఇండియా ఒక్కటే దేశంలో ఫుల్ సర్వీస్ క్యారియర్‌గా నిలిచిపోనుంది. కాగా గత 17 సంవత్సరాల్లో కింగ్‌ఫిషర్, జెట్ ఎయిర్‌వేస్‌తో సహా ఐదు ఫుల్ సర్వీస్ క్యారియర్స్ మూతపడ్డాయి. విస్తారా విలీనంతో దేశ విమానయాన రంగంపై టాటా గ్రూప్ పట్టు మరింత పెరగనుంది.
అప్పట్లో..
2012లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మన దేశంలోని విమానయాన సంస్థల్లో 49 శాతం వాటాలను కొనడానికి విదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలకు అనుమతి ఇచ్చింది. గల్ఫ్ విమానయాన సంస్థ ఎతిహాద్ నుంచి 24 శాతం వాటాను ప్రస్తుతం మూతపడిన జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలు చేసింది. అదేవిధంగా ఎయిర్‌ఏసియా, విస్తారా సంస్థలు ప్రారంభమయ్యాయి. విస్తారా గత పదేళ్లలో ఎఫ్‌ఎస్‌సీగా కార్యకలాపాలను ప్రారంభించిన ఏకైక విమానయాన సంస్థ. ఫుల్ సర్వీస్ క్యారియర్ అయిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ 2007లో ఎయిరిండియాలో విలీనమైంది. అప్పటి నుంచి కనీసం ఐదు ఎఫ్‌ఎస్‌సీలు మన దేశంలో ఉండేవి. కింగ్‌ఫిషర్ 2012లోనూ, ఎయిర్ సహారా 2019లోనూ తెరమరుగైపోయాయి. ఎఫ్‌ఎస్‌సీ అయిన జెట్ ఎయిర్‌వేస్ 25 ఏళ్లపాటు నడిచింది. ఆర్థిక ఒడుదొడుకుల కారణంగా 2019లో కుప్పకూలింది. దీనిని ప్రస్తుతం లిక్విడేషన్‌కు పెట్టారు. ఈ నెల 12 నుంచి ఇక ఎయిరిండియా మాత్రమే మన దేశంలో ఎఫ్‌ఎస్‌సీగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది.