Sunetra Pawar: 25వేల కోట్ల కుంభకోణంలో సునేత్ర పవార్‌కు క్లీన్‌చిట్
లోక్‌సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం;
రూ.25 వేల కోట్ల సహకార బ్యాంకు కుంభకోణం ఆరోపణల కేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌కు ముంబై పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చారు. సునేత్ర పవార్, ఆమె భర్త అజిత్ పవార్‌కు సంబంధించి లావాదేవీల్లో ఎలాంటి క్రిమినల్ నేరం జరుగలేదని పేర్కొంటూ మహారాష్ట్ర స్టేట్ సహకార బ్యాంకు(ఎంఎస్‌సీబీ) కేసును విచారిస్తున్న ముంబై పోలీసు విభాగానికి చెందిన ఆర్థిక నేరాల వింగ్(ఈవోడబ్ల్యూ) పేర్కొన్నది. రుణాల మంజూరుతో బ్యాంకుకు ఎలాంటి నష్టం రాలేదని తెలిపింది. ఈ కేసును మూసివేస్తూ ఈ ఏడాది జనవరిలో సమర్పించిన రిపోర్టు వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. సునేత్ర పవార్ ప్రస్తుతం రాష్ట్రంలోని బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పోటీచేస్తున్నారు.
గత ఏడాది శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చి, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ భార్య సునేత్రకు పోలీసులు క్లీన్‌చిట్ ఇవ్వడం ప్రతిపక్షాలకు ఎన్నికల వేళ ఆయుధంగా మారింది. బీజేపీ మరోసారి తన ప్రతిపక్షాలు పెట్టిన ‘వాషింగ్ మెషిన్’ పేరును సార్థకం చేసుకొన్నదని శివసేన(యూబీటీ) నేత ఆనంద్ దూబే ఎద్దేవా చేశారు. రూ.25 వేల కోట్ల స్కామ్ జరిగిందని, పవార్ కుటుంబం మొత్తం అవినీతిపరులేనంటూ సాక్షాత్తూ ప్రధాని మోదీ గతంలో ఆరోపణలు చేసిన కేసులోనే ఇప్పుడు పోలీసులు క్లీన్‌చిట్ ఇవ్వడం శోచనీయమని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన వాళ్లు బీజేపీలో చేరితే, ఆ పార్టీ వాషింగ్ మెషీన్‌లో ఉతికితే.. ఎలాంటి ఆరోపణలు, మరకలు అయినా మాయం అవుతాయనే విమర్శలు నిజమనే విషయాన్ని కమలం పార్టీ మరోసారి నిరూపించుకొన్నదని దూబే పేర్కొన్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించిన కేజ్రీవాల్, హేమంత్ సొరేన్‌లను జైలుకు పంపుతారని, వాళ్లతో(బీజేపీ) చేరిన వాళ్లకైతే డిప్యూటీ సీఎం, మంత్రి పదవులు వస్తాయని, లోక్‌సభ టికెట్లు కూడా ఇస్తారని విమర్శించారు.
తాజా ఎన్నికల్లో సునేత్ర పవార్ ఎన్డీయే తరఫున బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. శరద్ పవార్ కంచుకోట అయిన ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ఆయన కుమార్తె సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ ఆమె మరోసారి బరిలోకి దిగుతున్నారు. దీంతో బారామతిలో ఈ వదినా మరదళ్ల సవాల్ దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.