Delhi CM : కేజ్రీవాల్‌ అరెస్టుపై మళ్లీ స్పందించిన అమెరికా

Update: 2024-03-29 06:43 GMT

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టుపై అమెరికా మరోసారి స్పందించింది. ఈసారి కేజ్రీవాల్‌ అరెస్టుతోపాటు కాంగ్రెస్‌పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభన అంశాన్నీ ప్రస్తావించింది. వీటికి సంబంధించి నిష్పాక్షిక, పారదర్శక, నిర్ణీత గడువుతో కూడిన న్యాయప్రక్రియ కొనసాగుతుందని ఆశిస్తున్నామని పేర్కొంది. అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

కేజ్రీవాల్‌ అరెస్టు అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఆయన పట్ల నిష్పాక్షిక విచారణ జరగాలని కోరుకుంటున్నామని అమెరికా ఇటీవల వ్యాఖ్యానించటంపై కేంద్రప్రభుత్వం బుధవారం ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ ఉప అధిపతిని పిలిచి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అయినా అమెరికా కేజ్రీవాల్‌ అరెస్టుపై తన వైఖరిని పునరుద్ఘాటించటం గమనార్హం.

అమెరికా వ్యాఖ్యలపై స్పందిస్తూ... ‘భారత ఎన్నికల, న్యాయ ప్రక్రియలపై ఏ విదేశీ శక్తుల ప్రభావాన్ని ఆమోదించేది లేదు. భారత్‌లో న్యాయ ప్రక్రియలు చట్టబద్ధపాలనకు అనుగుణంగా పని చేస్తాయి. ఇతరులసార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాల పట్ల దేశాలు గౌరవభావంతో ఉండాలి’ అని విదేశాంగశాఖ పేర్కొంది.

Tags:    

Similar News