Manali Tourist Rush: హిమాచల్‌కు పోటెత్తిన టూరిస్టులు..
భారీగా ట్రాఫిక్ జామ్.. న్యూఇయర్ వేడుకల కోసం క్యూ;
దేశవ్యాప్తంగా క్రిస్మస్, న్యూయర్ సందడి నెలకొన్న వేళ...హిమాచల్ ప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాలకు ప్రజలు పోటెత్తారు. భారీ సంఖ్యలో వచ్చిన సందర్శకులతో మనాలీ సహా ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. రోడ్లపై వాహనాలు నిలిచి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయింది. సెలవు దినాలు ముగిసేదాకా తాము ఇలా రోడ్లపైనే ఉంటామోనని కొందరు పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల వరదలతో అల్లాడిన హిమాచల్ ప్రదేశ్‌కు పర్యాటకులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శీతాకాలంతో పాటు క్రిస్మస్, న్యూయర్ సెలవులు రావడంతో... సందర్శకులు మనాలికి భారీగా తరలివచ్చారు. సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయి. ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర పర్యాటక ప్రాంతాలకు అధిక సంఖ్యలో సందర్శకుల తాకిడి పెరిగింది. మనాలి పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55 వేల 345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని అధికారులు వెల్లడించారు.
హిమాచల్‌లో క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో... మంచు కురిసే ప్రాంతాల్లో రద్దీ పెరిగిపోయింది. కిలోమీటర్ల మేర పర్యాటకుల వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మనాలీ మార్గంతో పాటు అటల్ టన్నెల్ లో కొన్ని గంటలపాటు వాహనదారులు చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీనిపై కొందరు నెటిజన్లు సరదాగా స్పందించగా.... మరికొందరు అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ క్లియర్ అయ్యేలోగా తమ హాలిడే అయిపోతుందేమోనని కొందరు పోస్టు చేశారు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోహ్‌తంగ్‌లోని అటల్ సొరంగం గుండా మూడు రోజుల్లో 55,000 కంటే ఎక్కువ వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ గత 24 గంటల వ్యవధిలో 28,210 వాహనాలు అటల్ సొరంగాన్ని దాటాయి. ఓ వైపు పొగమంచు, మరోవైపు వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో సిమ్లా పూర్తిగా సందడిగా మారింది. అక్కడి పార్కింగ్ ప్రాంతాలన్నీ పూర్తిగా నిండిపోవడంతో పర్యాటకులు తమ వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరోవైపు నూతన సంవత్సర వేడుకల కోసం ఈ వారంలో లక్షకు పైగా వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మనాలిలోని ట్రాఫిక్‌పై.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. ప్రపంచంలోనే..అత్యంత పొడవైన అటల్ టన్నెల్ నుంచి డిసెంబర్ 24న 12 వేల వాహనాల్లో 65వేలమంది ప్రయాణించినట్లు పేర్కొన్నారు. మైనస్ 12 డిగ్రీల ఉష్ణోగ్రతలో అటల్ టన్నెల్ వద్ద రాకపోకలను పర్యవేక్షిస్తున్న పోలీసులను అభినందించారు. ప్రకృతి విపత్తు నుంచి కోలుకున్న హిమాచల్ ప్రదేశ్... ఈ పండగ సీజన్‌లో పర్యాటకులను ఆహ్వానిస్తోందని సీఎం పోస్ట్ చేశారు