World Largest Bell: ప్రపంచంలోనే అతి పెద్ద గంట
అచ్చును తెరుస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి;
రాజస్థాన్ రాష్ట్రం కోటా నగరంలోని చంబల్ రివర్ ఫ్రంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఈ ఉదయం గంట అచ్చును తెరుస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బెల్ మేకింగ్ ఇంజినీర్ దేవేంద్ర ఆర్య, మరో కూలీతో పాటు పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగానే వారు ప్రాణాలు కోల్పోయారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అచ్చుపెట్టెలోని గంటను తీయడానికి ఆర్య పైకి ఎక్కిన వెంటనే 35 అడుగుల పైనుంచి జారి కిందపడ్డారు. ఆయనతో ఒక కూలీ కూడా పడిపోయాడు. కోచింగ్ సెంటర్ లకు ప్రసిద్ధి చెందిన కోటాకు కొత్త రూపం ఇచ్చేందుకు ఇటీవలే చంబల్ రివర్ ఫ్రంట్‌ను నిర్మించారు. ఇటీవల రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ దాన్ని ప్రారంభించారు. అక్కడే ఈ గంటను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఈ గంట తయారీ మొదలైనప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నది. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గంటను సిద్ధం చేశారు. దాని బరువు 79 వేల కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు.