Anmol Bishnoi: అన్మోల్‌ బిష్ణోయ్‌ భారత్‌కు అప్పగింత

అన్మోల్ .. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్

Update: 2025-11-19 01:15 GMT

అమెరికా నుంచి ఇండియాకు ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌ను రప్పిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌. ఈ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌ను అమెరికా బహిష్కరించింది. ఈ విషయాన్ని బాబా సిద్ధిఖీ కుమారుడు, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ మీడియాకు తెలిపారు. బాబా సిద్ధిఖీ హత్య కేసులో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. అలాగే అన్మోల్ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలాను హత్య కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్‌ను కూడా అన్మోల్ బెదిరించాడు. దర్యాప్తు సంస్థలు ఇప్పుడు అన్మోల్ బిష్ణోయ్‌పై పట్టు బిగించాయి. ఆయన సోదరుడు లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ జైలులో ఉన్నాడు. 

బాబా సిద్ధిఖీ హత్య కేసులో మహారాష్ట్ర కోర్టు అన్మోల్‌పై వారెంట్ జారీ చేసింది. అనంతరం ఆయనపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. జీషాన్ యునైటెడ్ స్టేట్స్ నుంచి అన్మోల్ గురించి సమాచారం కోరినప్పుడు.. యుఎస్ ఫెడరల్ ఏజెన్సీ అతడిని బహిష్కరించినట్లు ధృవీకరించింది. ఈ చర్య కేంద్ర సంస్థలు, ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సంయుక్త ప్రయత్నం ఫలితం అని అధికారులు వెల్లడించారు. అప్పగింత ఒప్పందం ప్రకారం అన్మోల్‌ను ఇప్పుడు భారతదేశానికి తీసుకువస్తున్నారు. భారతదేశంలో ఆయన నిర్బంధం గురించి ఇంకా అధికారిక సమాచారం విడుదల కాలేదు. భారతదేశానికి అన్మోల్ బిష్ణోయ్ తిరిగి రావడం అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా ఒక ప్రధాన అడుగుగా భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా పలు ప్రముఖ కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు. సిద్ధూ మూసేవాలా హత్య కేసు, సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు, బాబా సిద్ధిఖీ హత్య కేసు, పలు రాష్ట్రాల్లో ఆయనపై ఉన్న అనేక ఇతర తీవ్రమైన కేసులు ఉన్నాయి. అన్మోల్  ఉదయం 10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారని, ఆ వెంటనే పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరుస్తారని సమాచారం. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లాతో కలిసి విదేశాలలో ఒక నైట్ పార్టీలో కనిపించాడు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఖైదీగా ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ కావడం, ఆయన తిరిగి భారతదేశానికి రావడం చాలా ముఖ్యమైనదిగా విశ్లేషకులు చెబుతున్నారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠా కార్యకలాపాలకు చాలా వరకు అన్మోల్ బాధ్యత తీసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News