జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం రాత్రి భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ అధికారి సహా నలుగురు సైనికులు అమరులయ్యారు. ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు కూడా గాయపడ్డారు. దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సైనికులతో కలిసి వారు నిర్బంధ తనిఖీలను ప్రారంభించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఎదురుపడి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదరుకాల్పులు ప్రారంభించారు.
సైనిక వాహనంపై ఆకస్మిక దాడి చేయడంతో గతవారంలో ఐదుగురు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. మరో ఐదుగురు సైనిక సిబ్బందికి గాయాలయ్యాయి. కఠువా జిల్లాలోని మారుమూల ప్రాంతం మాచేడీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పది మంది జవాన్ల బృందం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మాచేడీ- కిండ్లీ- మల్హార్ రోడ్డు మార్గంలో ట్రక్కులో వెళ్తూ గస్తీ నిర్వహిస్తుండగా, ముష్కరులు ఒక్క ఉదుటున వాహనం పైకి గ్రనేడ్ విసిరారు.
ఫూంచ్, రాజౌరీ జిల్లాల్లో ప్రారంభమైన ఉగ్రదాడులు ఇప్పుడు క్రమంగా జమ్మూవ్యాప్తంగా విస్తరించాయి. కొన్నేళ్లుగా ఇక్కడ ఎలాంటి ఉగ్రకార్యకలాపాలు లేకపోవడం గమనార్హం. జమ్మూ ప్రాంతంలో 32 నెలల్లో ఉగ్రదాడుల్లో 40 మందికి పైగా సైనికుల ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 60 మంది ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. గత నెల భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను పటిష్ఠం చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులు పైచేయి సాధించొద్దని సూచించారు.