Swati Maliwal : మలివాల్‌పై దాడి నిజమే,అంగీకరించిన ఆప్ నేత సంజయ్ సింగ్
బిభవ్ కుమార్‌పై కేజ్రీవాల్ చర్యలు తీసుకుంటారని వెల్లడి;
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌కు ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని తీవ్రంగా కుదిపేసింది. స్వాతి మలివాల్ పట్ల అనుచితంగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డ కేజ్రీవాల్ పీఎస్ బిభవ్‌కుమార్‌పై కఠిన చర్య తీసుకుంటామని ఆప్ నేత సంజయ్ సింగ్ తాజాగా ప్రకటించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుశ్చర్యను పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు.AAP Arvind Kejriwal misbehaved Swati Maliwal
‘స్వాతి మలివాల్ సోమవారం సీఎం కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు ఆయన అధికారిక నివాసానికి వెళ్లారు. డ్రాయింగ్ గదిలో సీఎం కోసం ఎదురుచూస్తుండగా, ఆమెతో పీఎస్ బిభవ్‌కుమార్ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయం కేజ్రీవాల్‌కు తెలిసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు’ అని చెప్పారు. ఘటనకు సంబంధించి స్వాతి మలివాల్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే రాతపూర్వక ఫిర్యాదు ఆమె నుంచి అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడైన బిభవ్ కుమార్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో కొత్త వివాదంలో చిక్కుకున్న అతడు ఎవరు..? ఆ వివరాలు.. 2000 సంవత్సరం సమయంలో ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఓ పత్రికలో బిభవ్ కుమార్ వీడియో జర్నలిస్టుగా పనిచేసేవాడు. ఆ తర్వాత కాలక్రమంలో ఆ సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీగా రూపాంతరం చెందింది. ఈ సమయంలో కేజ్రీవాల్‌తో అతడికి స్నేహం పెరిగింది. కేజ్రీవాల్‌కు దిల్లీ సర్కిల్‌లో రోజువారీ పనులు చేయడానికి అత్యంత నమ్మకమైన సహాయకుడిగా ఎదిగాడు. కేజ్రీవాల్‌కు రోజువారీ డయాబెటిక్ ఔషధాలు ఇవ్వడం, డైట్‌ను బిభవ్ కుమారే చూసుకునేవాడు. 2014 లోక్‌సభ ఎన్నికల వేళ పంజాబ్ పర్యటన సమయంలో ఆప్ అధినేత పంటినొప్పితో బాధపడితే.. ఆయనకు ఆహారం అందించే బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించాడు. పార్టీలో బిభవ్ ఏమైనా చెబితే.. అది సీఎం నుంచి వచ్చిన మాటగానే చాలా మంది భావిస్తారు.
అయితే 2007లో బిభవ్‌కుమార్ ప్రభుత్వ సిబ్బంది విధులను ఆటంకపర్చినట్లు ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసును కారణంగా చూపించి ఇటీవల ఢిల్లీ ఎల్జీ అతడిని సీఎం వ్యక్తిగత కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. గతేడాది ఆగస్టులో దిల్లీ పీడబ్ల్యూడీ డిపార్ట్‌మెంట్ అతడికి కేటాయించిన బంగ్లాను వాపస్ తీసుకొంది. ఈ అంశం కూడా వివాదాస్పదమైంది. ఆయన మద్యం కుంభకోణం కేసులో కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఫిబ్రవరిలో ఈడీ 12 చోట్ల నిర్వహించిన తనిఖీల్లో బిభవ్ కుమార్‌కు చెందిన ఆస్తులు కూడా ఉన్నాయి. అతడిని ఒక సారి అధికారులు ప్రశ్నించారు.