Pakistan Floods: పాక్‌లో జల ప్రళయం.. కొనసాగుతున్న మృత్యుఘోష
140 మంది చిన్నారులు సహా 299 మంది మృతి;
పాకిస్థాన్‌లో రుతుపవనాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. జూన్ చివరి వారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 299 మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో 140 మంది చిన్నారులే ఉండటం అందరినీ కలచివేస్తోంది. భారీ వర్షాల వల్ల సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, మృతుల్లో 140 మంది చిన్నారులతో పాటు 102 మంది పురుషులు, 57 మంది మహిళలు ఉన్నారు. ఈ ప్రకృతి విపత్తులో మరో 715 మంది గాయపడగా, వారిలోనూ 239 మంది చిన్నారులు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
వర్షాల ప్రభావం తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌పై అత్యధికంగా ఉంది. ఇక్కడ ఒక్కచోటే 162 మంది మృతి చెందారు. దీని తర్వాత ఖైబర్ పఖ్తుంఖ్వాలో 69, సింధ్‌లో 28, బలూచిస్థాన్‌లో 20 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదల కారణంగా 1,676 ఇళ్లు దెబ్బతినగా, వాటిలో 562 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. సుమారు 428 పశువులు కూడా మృత్యువాత పడ్డాయని అధికారులు తెలిపారు.
రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు 4 నుంచి రుతుపవనాలు మరింత బలపడి దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించవచ్చని అంచనా వేసింది. దీంతో సహాయక బృందాలను, అత్యవసర సేవల విభాగాలను అధికారులు అప్రమత్తం చేశారు.