Children's Day 2023 : చిన్నారుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా
చాచాజీ పుట్టిన రోజు సందర్భంగా
ప్రతీయేట భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటామన్న సంగతి తెలిసిందే. నెహ్రూ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నెహ్రూకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. పలువురు కేంద్రమంత్రులు కూడా నెహ్రూ సేవలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ , నెహ్రూ స్మారకం శాంతివనం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం త్రివర్ణ రంగులో ఉన్న బెలూన్లను గాల్లోకి ఎగరేశారు. పండిట్ జవహర్ లాల్ స్వేచ్ఛ, పురోగతి, న్యాయమని కొనియాడారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు నేటి తరానికి ఎంతో అవసరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
మొదట్లో పిల్లల దినోత్సవాన్ని నవంబర్ 20న జరిపేవారు. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి నవంబర్ 20ని అంతర్జాతీయ పిల్లల దినోత్సవంగా ప్రకటించింది. అందువల్ల ఇండియా కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. ఐతే... నెహ్రూ మరణం తర్వాత... పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి... భారతీయులు నవంబర్ 14ను జాతీయ బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నారు.
ఇండిపెన్‌డెన్స్ రాక ముందు బ్రిటిష్ పాలనలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న భారతదేశాన్ని.. స్వాతంత్రం అనంతరం మొట్టమొదటి దేశ ప్రధానిగా పురోగమనం వైపు నడిపించడంలో ఆయన చూపించిన కీలక పాత్ర పోషించారు. పిల్లల పట్ల ఆయనకు ఉన్న అమితమైన ఇష్టం కారణంగా దేశానికి ప్రధానిగా ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్ళినా పిల్లలను ఆప్యాయంగా పలకరించేవారు. వారిని దగ్గరకు తీసుకునే వారు. దీంతో పిల్లలంతా ఆయనను చాచా నెహ్రు అని పిలిచేవారు. ఆయనకు గులాబీ పువ్వులు అంటే ఎనలేని మక్కువ. దీంతో ఆయనకు గులాబీ పువ్వులను ఇచ్చి మరీ పిల్లలు ఆయన చుట్టూ చేరేవారు. బాలల దినోత్సవం చిన్నారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన బాల్యం అందించే ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. పిల్లల హక్కులను ప్రోత్సహించడం, వారి విద్య, శ్రేయస్సుకి పాటుపడటంతో పాటు, పోషకాహారం, ఇంట్లో సురక్షితమైన వాతావరణం అందించడం వంటి బాధ్యతలను గుర్తు చేస్తుంది. పేదరికం, నిరక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, బాల కార్మికులుగా మారడం వంటి పిల్లలు ఎదర్కుంటున్న సవాళ్లపై అవగాహన పెంచుతుంది.