Bihar Elections: బీహార్ ఓటర్ లిస్ట్ లో ఆఫ్ఘన్, బంగ్లా వాసుల పేర్లు..
3 లక్షల మందికి నోటీసులు
అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీహార్ లో ఓటర్ జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టిపెట్టింది. అక్రమంగా ఓటు హక్కు పొందిన వారి పేర్లను తొలగించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే (సర్)ను చేపట్టిన విషయం తెలిసిందే. బీజేపీ వ్యతిరేకులు, ప్రతిపక్షాల మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకే ఈ సర్వే చేపట్టిందంటూ రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఓటర్ జాబితాలో పెద్దమొత్తంలో అనర్హుల పేర్లు చేరాయని ఈసీ వాదిస్తోంది. పొరుగు దేశాలకు చెందిన వ్యక్తులు కూడా బీహార్ లో అక్రమంగా ఓటు హక్కు పొందారని ఆరోపించింది.
ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది. మన దేశానికి పొరుగున ఉన్న నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ లతో పాటు ఆఫ్ఘనిస్థాన్ వాసులు పలువురు ఓటు హక్కు పొందారని తేలినట్లు వెల్లడించింది. అనర్హులుగా గుర్తించిన సుమారు 3 లక్షల మంది ఓటర్లకు నోటీసులు పంపినట్లు తెలిపింది. వారి గుర్తింపు పత్రాలను పరిశీలించిన తర్వాత అర్హుల పేర్లను కొనసాగిస్తూ అనర్హుల పేర్లను తొలగిస్తామని, సవరించిన ఓటర్ జాబితాను సెప్టెంబర్ 30న విడుదల చేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఎన్నికల సంఘానికి గురువారం నాటికి మొత్తం 1,95,802 దరఖాస్తులు వచ్చాయి.. వాటిలో 24,991 దరఖాస్తులు ఇప్పటికే పరిష్కరించబడ్డాయి. అయితే, కొత్తగా వచ్చిన వాటిలో మార్పులు, చేర్పుల గురించి దరఖాస్తులు వచ్చాయో అనేదానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. CPI(ML) 79 పిటిషన్లు, రాష్ట్రీయ్ జనతా దళ్ పార్టీ (RJD) 3 పిటిషన్లు వేయగా.. బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు.
99 శాతం పత్రాల ధృవీకరణ పూర్తి..
జూన్ 24 నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు జరిగిన ప్రత్యేక పరిశీలనలో బీహార్‌లోని 7.24 కోట్ల ఓటర్లలో 99.11 శాతం మంది పత్రాలు ధృవీకరించబడ్డాయి. 98.2 శాతం ఓటర్లు తమ డాక్యుమెంట్లు సమర్పించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు, ఆధార్ కార్డు లేదా 11 రకాల అధికారిక పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.