Electricity Bill : సున్నా బిల్లుల కాలం చెల్లింది.. కరెంట్ వాడకపోయినా ఇకపై బిల్లు కట్టాల్సిందే.

Update: 2026-03-13 08:30 GMT

Electricity Bill : ఢిల్లీలో నివసిస్తున్న వాహనదారులకే కాదు, ఇప్పుడు ఇంటి యజమానులకు కూడా షాక్ తగలనుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకంలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఢిల్లీలో నెలకు 200 యూనిట్ల లోపు కరెంట్ వాడితే బిల్లు సున్నా వచ్చేది. ఇందులో కరెంట్ ఛార్జీలతో పాటు ఫిక్స్‌డ్ ఛార్జీలను కూడా ప్రభుత్వం మాఫీ చేసేది. కానీ ఇకపై కరెంట్ అస్సలు వాడని ఇళ్లకు ఈ రాయితీని కట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సుమారు 44.5 లక్షల మంది వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

ప్రభుత్వ దృష్టి ఇప్పుడు డోర్మెంట్ లేదా నిష్క్రియ వినియోగదారులపై పడింది. అంటే, మీ పేరు మీద మీటర్ ఉంటుంది కానీ నెలంతా ఆ ఇంట్లో కరెంట్ వాడకం సున్నాగా ఉంటుంది. ఇలాంటి ఇళ్లలో కరెంట్ వాడకపోయినా, విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్ ఛార్జీలను ఇప్పటివరకు ప్రభుత్వమే భరిస్తోంది. అయితే, ఇళ్లు మూసివేసి ఊర్లకు వెళ్లిన వారికి లేదా కేవలం సబ్సిడీ కోసం అదనపు మీటర్లు తీసుకున్న వారికి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు ఖర్చు చేయాలనేది అధికారుల ప్రశ్న. అందుకే ఇకపై మీటర్ రీడింగ్ సున్నా ఉంటే సబ్సిడీ ఎత్తివేసి, కనీసం రూ.200 వరకు ఫిక్స్‌డ్ ఛార్జీలు వసూలు చేయనున్నారు.

ఈ నిర్ణయానికి వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. ఢిల్లీలో 2020 నుంచి 2025 మధ్య కాలంలో విద్యుత్ వినియోగదారుల సంఖ్య ఏకంగా 12 లక్షలు పెరిగింది. కానీ, అదే సమయంలో నీటి కనెక్షన్ల సంఖ్య మాత్రం పెద్దగా పెరగలేదు. సబ్సిడీని అడ్డగోలుగా వాడుకోవడానికి చాలామంది ఒకే ఇంట్లో రెండు మూడు మీటర్లు తీసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా శీతాకాలంలో వేలాది కనెక్షన్లపై ఒక్క యూనిట్ కూడా ఖర్చు కావడం లేదు. ఇలాంటి నకిలీ లేదా నిష్క్రియ ఖాతాలను ఏరివేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు.

ప్రభుత్వంపై పెరుగుతున్న ఆర్థిక భారమే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణం. 2015-16లో ఈ ఉచిత విద్యుత్ పథకం ప్రారంభమైనప్పుడు దీని బడ్జెట్ కేవలం రూ.1,442.76 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ భారం ఏకంగా రూ.4,000 కోట్లకు చేరుకుంది. ఢిల్లీలో ఉన్న మొత్తం 62 లక్షల వినియోగదారుల్లో 58 లక్షల మందికి పైగా సబ్సిడీ పొందుతున్నారు. ఈ భారీ ఖర్చును తగ్గించుకోవడానికి, ఇకపై కనీస విద్యుత్ వాడకం అనే నిబంధనను తీసుకురానున్నారు. ఒకవేళ మీ నెలవారీ వాడకం ఆ పరిమితి కంటే తక్కువగా ఉంటే, మీరు సబ్సిడీకి అనర్హులుగా మారతారు.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 200 యూనిట్ల వరకు బిల్లు సున్నాగా వస్తుండగా, 201 నుంచి 400 యూనిట్ల వరకు 50 శాతం రాయితీ లభిస్తుంది. 401 యూనిట్లు దాటితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం, ఇల్లు మూసి ఉన్నా లేదా కరెంట్ వాడకం నామమాత్రంగా ఉన్నా బిల్లు కట్టక తప్పదు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున, ఢిల్లీ వాసులు తమ విద్యుత్ వినియోగంపై ఒక కన్నేసి ఉంచడం మంచిది.

Tags:    

Similar News