బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అటు ప్రభుత్వం సైతం బాధ్యులపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ ను సస్పెండ్ చేసింది. అయితే క్యాట్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది.
సస్పెన్షన్ నిర్ణయాన్ని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ మంగళవారం కొట్టివేసింది. న్యాయమూర్తులు బికె శ్రీవాస్తవ, సంతోష్ మెహ్రాలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే, గతంలో ఉన్న అన్ని అలవెన్సులు, సౌకర్యాలను అందించాలని ఆదేశించింది.
CATని ఆశ్రయించిన వికాస్
ఆర్‌సిబి ఐపిఎల్ విజయాన్ని జరుపుకోవడానికి జూన్ 3న చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇష్టమైన ఆటగాళ్లను చూడటానికి లక్షలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదనపు పోలీసు కమిషనర్ వికాస్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ వికాస్ కుమార్ CATని ఆశ్రయించారు.
ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసి వివరణ కోరింది. దరఖాస్తుపై అభ్యంతరాలు దాఖలు చేయడానికి ఏజీ అదనపు సమయం కోరారు. ఇప్పుడు, వికాస్ కుమార్ సస్పెన్షన్ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని CAT రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు, ఈ సంఘటనపై దర్యాప్తు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ సంఘటనకు సంబంధించి ఆర్‌సిబి మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే, సునీల్ మాథ్యూ, కిరణ్, శమంత్‌లను సిఐడి అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అరెస్టు చేసిన వ్యక్తులను కస్టడీలో ఉంచడానికి నిరాకరించిన కోర్టు, వారి జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించింది. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.